Saturday, October 19, 2019
Follow Us on :

గజ్వేల్ కు రైలు వచ్చేస్తుందోచ్..!

By BhaaratToday | Published On Feb 10th, 2019

గజ్వేల్ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన రైలుప్రయాణం మార్చిలో నెరవరేనున్నది. ఢిల్లీ, ముంబై, తిరుపతి, విజయవాడ వంటి దూరప్రాంతాలకు వెళ్లడానికి హైదరాబాద్‌కు వెళ్తే తప్ప, రైలు సౌకర్యంలేని గజ్వేల్ ప్రజలకు ఆ కొరత తీరనున్నది. మనోహరాబాద్-కొత్తపల్లి రైలుమార్గంలో తొలిదశ గజ్వేల్ వరకు పూర్తిచేసి నెలలోపు రైలును పరుగులు తీయించడానికి రైల్వే యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నది. మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు ట్రాక్ పనులు పూర్తి కావస్తుండగా రామాయిపల్లి వద్ద జాతీయరహదారి క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే రైల్వేట్రాక్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు. మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వేలైన్ 2012-13లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.1,160 కోట్లతో 151.36 కిలోమీటర్ల పొడవునా రైల్వేలైన్ నిర్మాణానికి 2016, ఆగస్టు 7న గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. తొలిదశలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 33 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం కోసం 860 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు అప్పగించింది. కేంద్రం గతంలో సుమారు రూ.415 కోట్లు కేటాయించగా ఇటీవల బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది. 33 కిలోమీటర్లలో ఇప్పటివరకు 20 కిలోమీటర్ల వరకు రైల్వేపట్టాల లింక్ పనులు పూర్తికాగా, మరో 10 కిలోమీటర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. జాతీయ రహదారిపై రామాయపల్లి వద్ద రోడ్డు క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నది. నెలరోజుల్లోపు ఈ బ్రిడ్జి పనులు పూర్తికావడమే కాకుండా ట్రాక్‌ను రైలు ప్రయాణానికి సిద్ధం చేస్తామని అధికారులు చెప్తున్నారు. గజ్వేల్ వరకు సింగిల్ బ్రాడ్‌గేజ్ లైన్ పూర్తికాగానే రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గజ్వేల్‌తోపాటు నాచారంలో రైల్వేస్టేషన్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గజ్వేల్ రైల్వేస్టేషన్‌లో ఐదు ప్లాట్ ఫారాలు నిర్మాణమవుతాయని అధికారులు చెప్తున్నారు. ఓ మెయిన్‌లైన్, రెండు లూప్‌లైన్‌లు, ఓ గూడ్స్ లైన్, మరో ట్రాక్ మిస్సింగ్, సీడింగ్ లైన్ ప్లాట్ ఫారాలు నిర్మించనున్నారు.