Monday, August 19, 2019
Follow Us on :

ధోనీ మ‌మ్మ‌ల్ని ప‌క్క‌కు పెట్టాల‌నుకున్నాడు.. వారి కోస‌మే..

By BhaaratToday | Published On Jul 19th, 2019

మిస్ట‌ర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్ చివ‌రిద‌శ‌లో ఉన్నాడని, ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సూచించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ధోనీ రిటైర్మెంట్‌ వ్యవహారంపై స్పందించారు. ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కుర్రాళ్లకు ఎక్కువగా చాన్సులు ఇచ్చేవాడని తెలిపారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ సిరీస్‌లో సెహ్వాగ్, సచిన్‌లతో పాటు తనను కూడా పక్కనబెట్టాలనుకున్నాడని గంభీర్ వెల్లడించారు. యువ ఆటగాళ్ల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాడని వివరించారు. 2023 ప్రపంచకప్ కోసం అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ను సిద్ధం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని గంభీర్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తు వికెట్ కీపర్‌గా రిషభ్‌ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లేక మరే యువ ఆటగాడికైనా విడివిడిగా అవకాశాలిచ్చి పరీక్షించాలని సూచించారు. ఒక్కొక్కరికి ఏడాదిన్నర పాటు అవకాశం ఇచ్చి ఎవరు బాగా ఆడితే వారిని తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

Related image

గెలిస్తే క్రెడిట్‌ అంతా ధోనీకివ్వడం.. ఓడితే నిందించడం సరికాదన్నారు. గణంకాలు చూస్తే ధోనీ  అత్యుత్తమ కెప్టెన్‌. కానీ.. అంతమాత్రాన మిగతా కెప్టెన్‌లు గొప్పవారు కాదని కాదు. సౌరవ్‌ గంగూలీది అద్భుతమైన కెప్టెన్సీ. అతని సారథ్యంలోనే మనం విదేశాల్లో గెలుపునందుకున్నాం. విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌, ఆసీస్‌లో టెస్ట్‌ సిరీస్‌ గెలిచాం. ధోనీ రెండు ప్రపంచకప్‌లు తీసుకురావడం నిజం. కానీ ఆ గెలుపు క్రెడిట్‌ను కెప్టెన్‌గా అతనొక్కనికే ఇవ్వడం.. ఓడినప్పుడు నిందించడం మాత్రం సరైంది కాదు. ప్రపంచకప్‌లు, చాంపియన్స్‌ ట్రోఫీ ధోనీ తీసుకురావచ్చు. కానీ ఇతర కెప్టెన్‌లు కూడా ఆటపరంగా జట్టును అత్యున్నత స్థానానికి తీసుకెళ్లారని గంభీర్‌ అభిప్రాయపడ్డారు.