Wednesday, October 16, 2019
Follow Us on :

వారిద్దరూ అతడి కెరియర్‌కు ఫుల్‌స్టాప్ పడేలా చేశారు

By BhaaratToday | Published On Aug 4th, 2019

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహాన్‌లపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఫ్లోరిడాలో విండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా పేసర్ నవ్‌దీప్ సైనీ ఈ మ్యాచ్‌లో విజృంభించి మూడు వికెట్లు తీసి అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టడంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.

అయితే.. సైనీపై ప్రశంసలు కురిపించిన గంభీర్.. బిషన్‌సింగ్ బేడీ, చేతన్ చౌహాన్‌లపై తీవ్ర విమర్శలు చేశాడు. గతంలో సైనీని ఢిల్లీ రంజీ జట్టులోకి తీసుకోమని చెబితే తీవ్రంగా వ్యతిరేకించారని, కనీసం పరీక్షించకుండానే అతడి కెరియర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేలా ప్రవర్తించారని మండిపడ్డాడు. ఇప్పుడు అదే సైనీ తిరుగులేని ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించాడని కొనియాడాడు. సైనీ బౌలింగ్‌కు బేడీ, చౌహాన్‌ల మిడిల్ స్టంప్స్ ఎగిరిపోయాయని ఎద్దేవా చేశాడు.

ఇదిలావుంటే.. సైనీ ప్రతిభను అందరికంటే ముందే గుర్తించిన గంభీర్.. ఢిల్లీ రంజీ జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, బేడీ, చౌహాన్‌లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, గంభీర్ పట్టుబట్టి మరీ జట్టులోకి తీసుకున్నాడు. జట్టులోకి వచ్చాక సైనీ చెలరేగిపోయాడు. దేశవాళీ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.