Tuesday, October 15, 2019
Follow Us on :

డిస్కవరీ ఛానల్ లో చూపించే సుడిగుండాలు.. గోదావరిలో ఉన్నాయి

By BhaaratToday | Published On Sep 19th, 2019

దేవీపట్నం వద్ద గోదావరిలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, గజఈతగాళ్ల సాయంతో 5వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 31 మంది ప్రయాణికుల మృతదేహాలను అధికారులు గుర్తించారు. 

ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ బీఎన్ సింగ్ గోదావరిలో ఉన్న సుడిగుండాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సుడిగుండాల్లో గజ ఈతగాళ్లు సైతం చిక్కుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిని మేమెప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. అక్కడ ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉందని, సుడిగుండాలు ఏర్పడుతుండటం వల్ల సహాయక బోట్లను ఎక్కువసేపు స్థిరంగా నిలిపి ఉంచలేమని వారు తేల్చారు. బోటు మునిగిపోయిన ప్రాంతం సుడిగుండాల మధ్య ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దాన్ని బయటకు తీసేందుకు వెళ్తున్న బోట్లను కూడా అది లోపలికి లాగేసుకు ప్రయత్నిస్తుండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 68 మంది సభ్యులున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోందని తెలిపారు. తొలుత రబ్బరు బోట్లతో మృతదేహాలను వెలికితీశామనీ, ప్రస్తుతం లాంచీని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రమాదం జరిగిన చోట నది చాలా విశాలంగా ఉంది. కొద్దిదూరంలోనే మధ్యలో కొండ ఉండటంతో ఈ సుడిగుండాలు ఉండడంతో పడవలను కూడా స్థిరంగా ఉంచడం కష్టంగా ఉంది. మిగిలిన 13 మంది జాడను త్వరలోనే కనుక్కుంటామన్నారు. 

మునిగిపోయిన బోట్లను వెలికితీయడంలో నిపుణుడు, కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందాన్ని రప్పించారు. ధర్మాడి సత్యం మాట్లాడుతూ ఇంతటి మహా సుడిగుండాన్ని తానెప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదన్నారు. ఇలాంటి ప్రదేశాన్ని తాను డిస్కవరీ ఛానెల్‌లోనే చూశానని సత్యం వ్యాఖ్యానించారు. 


మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. అక్కడకు బోట్లు వెళ్లడమే చాలా కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. నేవీ, స్థానిక యంత్రాంగం సాయంతో లాంచీకి లంగరు వేసి పైకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.