Saturday, October 19, 2019
Follow Us on :

తన పంతం నెగ్గించుకున్న రాజాసింగ్‌.. రాజా సింగ్ అనే నేను..!

By BhaaratToday | Published On Jan 19th, 2019

జనవరి 17వ తేదీన.. తెలంగాణ ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా... 114 మంది ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేయని వారిలో రాజా సింగ్ కూడా ఉన్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేతను నియమించడాన్ని రాజా సింగ్ తప్పుపట్టారు. ఎంఐఎం నేతకు ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించడాన్ని వెనక్కి తీసుకోవాలని అప్పట్లోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఎంఐఎం నేత ప్రొటెం స్పీకర్‌గా ఉన్నంత కాలం తాను అసెంబ్లీకి రానని స్పష్టం చేశారు.

 

ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉండగా తాను ప్రమాణం చేయనని మాట మీద నిలబడ్డ  ఘోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తన పంతం నెగ్గించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి ఎదుట ఆయన చాంబర్‌లో ఈరోజు ప్రమాణం చేశారు. స్పీకర్‌ పోచారం రాజాసింగ్‌తో ఈరోజు ప్రమాణం చేయించారు. రాజాసింగ్‌ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 

 

ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని.. భారత్ మాతా కీ జై, జై భారత్ అని నానాదాలు చేయని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు అప్పగించడం ఏంటని కేసీఆర్‌ను గతంలోనే ప్రశ్నించారు. ప్రొటెం స్పీకర్ చేత ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని, స్పీకర్ ఎన్నిక తర్వాతే తాను అసెంబ్లీలో కాలుపెడతానని చెప్పారు. అన్నట్లుగానే ఆయన మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి రాలేదు. ఇప్పుడు  తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి ఎదుట ప్రమాణస్వీకారం చేశారు.