Tuesday, October 15, 2019
Follow Us on :

మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌సంగించిన గ‌వ‌ర్న‌ర్

By BhaaratToday | Published On Jan 19th, 2019

తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటులో ముందంజలో ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. శనివారం మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గత నాలుగు సంవ‌త్స‌రాల్లో నీటిపారుదల రంగానికి రూ.77 వేల 777 కోట్లు ఖర్చు చేశామ‌ని, రాబోయే కాలంలో రూ.లక్షా 17 వేల కోట్ల విలువైన పనులు చేస్తామని చెప్పారు. విద్యుత్‌ కోతలను అధిగమించి ప్రభుత్వం తొలి విజయం సాధించిందని పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయ సత్ఫలితాలిచ్చిందని గవర్నర్ అన్నారు. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కళ్యాణలక్ష్మి పథకం దేశానికి ఆదర్శమని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పారదర్శక విధానాలు అమలవుతున్నాయన్నారు.
 
రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా రైతు బంధు :
రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం తీసుకొచ్చామని, రైతుబంధు పథకాన్ని ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలు ప్రశంసించారని తెలిపారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు రైతుబంధును అమలు చేసే దిశగా సాగుతున్నాయని తెలిపారు. రైతు కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేందుకు రైతుబీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. రూపాయి ఖర్చు లేకుండా రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇచ్చామని, అలాగే కుల వృత్తుల వారికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ అవసరాలకు చేనేతల నుంచి పెద్ద ఎత్తున వస్త్రాలు కొనుగోలు చేశామన్నారు. గొల్ల కురుమలకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌లో పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ దేశంలో అగ్ర‌స్థానంలో నిలిచింది:
ఐటీ రంగం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గ‌వర్న‌ర్ అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు చేపట్టామని గవర్నర్ వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మార్చి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాల్లో ఇంటింటికి నల్లా నీరు సరఫరా చేస్తామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించడం సంతోషదాయకమన్నారు. నిర్దేశించుకున్న సమయానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.