Friday, December 06, 2019
Follow Us on :

ఆయనకు ఓడిపోతామన్న విషయం అర్థమైంది.. అందుకే అలా..!

By BhaaratToday | Published On Apr 12th, 2019

చంద్రబాబుకు ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం అర్థమైందని, తన ఓటమిని ఎన్నికల కమీషన్ మీద నెట్టే వేసేందుకే అలా ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. శుక్రవారం  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అని, ఎన్నికల సంఘం ఎవరి మాట వినదని అన్నారు. నరేంద్ర మోదీ మాట ఎన్నికల కమిషన్ విన్నట్లయితే మోదీ బయోపిక్ విడుదలను ఎందుకు నిలుపుదల చేస్తోందని ప్రశ్నించారు.

టీడీపీకి ఓటు వేస్తే వైఎస్సార్‌సీపీ వెళ్తుతోందన్న చంద్రబాబు మాటలు ఆయన ఓటమిని తెలియజేస్తున్నాయని జీవీఎల్‌ అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతోందన్నారు. పోలింగ్ శాతం పెరగడం ద్వారా ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయం అర్థమవుతోందన్నారు.

ఈవీఎంలు పని చేయడం లేదని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు. ఈవీఎంలలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు సహజమని, వాటిని వెంటనే ఎన్నికల కమిషన్ సరిదిద్దిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నరని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.