Tuesday, October 15, 2019
Follow Us on :

సింగర్ సప్నా షోలో తొక్కిసలాట..! తీవ్ర ఉద్రిక్తత..!!

By BhaaratToday | Published On Feb 7th, 2019

హరియాణాకు చెందిన సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తర భారతదేశంలో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె కార్యక్రమం ఉందంటే కుర్రకారు మత్తెక్కి పోతుంది. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా రాజ్‌గఢ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కూడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే, నిర్వహణ లోపాల కారణంగా షోలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇసుకేస్తే రాలనంతమంది జనం కార్యక్రమానికి హాజరయ్యారు. సప్న స్టేజీపైకి రాగానే సీట్లపై నుంచి ఒక్కసారిగా పైకిలేచిన అభిమానులు ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అభిమానులు గాయపడ్డారు. దీంతో కల్పించుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించడంతో అభిమానులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అదే సమయంలో సప్నా చౌదరిని వేదికపై నుంచి పోలీసులు క్షేమంగా తరలించారు. కాగా, బిగ్‌బాస్ 11 పోటీదారు అయిన సప్నా చౌదరి గ్లామర్ ఇండస్ట్రీలో పాపులర్ అయింది. గతేడాది నవంబరులో బెగూసరాయ్‌లో నిర్వహించిన సప్న షోలోనూ గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.