Tuesday, October 15, 2019
Follow Us on :

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

By BhaaratToday | Published On Oct 9th, 2019

 గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..! గత కొన్నేళ్లుగా ఇలాంటి వర్షాలు చూడలేదు అని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ వర్షాలు మరికొన్ని రోజులు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో మరిన్ని రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నాయి. ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. 

 భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మధ్య మహారాష్ట్ర, యానాం, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అసోం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. సిక్కిం, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. 

ఇక గుంటూరు జిల్లా బాపట్ల మండలం మద్దిబోయినపాలెంకు చెందిన వీరయ్య, ముసలయ్య, బాజీ, శేషయ్యకు చెందిన గొర్రెలపై పిడుగు పడింది. ఈరోజు ఉదయం బాపట్ల మండలం వెదుళ్లపల్లె రైల్వే ట్రాక్‌ సమీపంలో మేపుతుండగా భారీ ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమయ్యింది. కాసేపటికి ఆ ప్రాంతంలోనే పిడుగు పడడంతో మందలోని 150  గొర్రెలు చనిపోయాయి. 

ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్సీ కాలనీకి చెందిన ఇరుగు శ్రీను (20), బలంతు ప్రవీణ్‌ (19), జి.నవీన్‌ (19), ఉసికెల గోపిలు మంగళవారం సాయంత్రం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమయ్యింది. దీంతో స్నేహితులంతా ఓ చెట్టు కిందకు చేరుకున్నారు. ఆ చెట్టు మీదే పిడుగు పడడంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే చనిపోగా, గోపి తీవ్రంగా గాయపడ్డాడు.