Thursday, December 05, 2019
Follow Us on :

తెలంగాణ మాజీ స్పీక‌ర్ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు జారీ

By BhaaratToday | Published On Feb 16th, 2019

తెలంగాణ గత శాసనసభలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌లను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన కేసు హైకోర్టులో మ‌రో కొత్త మలుపు తిరిగింది. శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులను కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు అదుపులోకి తీసుకుని జుడీషియల్‌ రిజిస్ట్రార్‌కు అప్పగించింది. అయితే, పదివేల రూపాయల చొప్పున ఇద్దరూ వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి విడుదలయ్యారు. అయితే ఈ కేసులో అప్పటి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టేనని అభిప్రాయపడిన కోర్టు ఆయనను కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసింది. అలాగే, నోటీసులిచ్చినా ఎందుకు స్పందించలేదంటూ  అప్పటి డీజీపీ, నల్గొండ, జోగులాంబ గద్వాల జిల్లాల ఎస్పీలపై  ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదని, తదుపరి విచారణకు హాజరుకాకుంటే సుప్రీంకోర్టుకు నివేదిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

మరోవైపు, హైకోర్టు నోటీసులను విస్మరించిన మధుసూదనాచారిపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చిన సందర్భాలు గతంలో ఉన్నాయంటూ మధుసూదనాచారికి హెచ్చరికలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో తాము ఇచ్చిన నోటీసులకు ఎందుకు స్పందించలేదో మార్చి 8న చెప్పాలంటూ మాజీ స్పీకర్  మధుసూదనాచారి, డీజీపీ, నల్గొండ, జోగులాంబ ఎస్పీలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.