Sunday, December 15, 2019
Follow Us on :

తెలంగాణలో నిండు కుండల్లా జలాశయాలు

By BhaaratToday | Published On Aug 3rd, 2019

-నిండుకుండల్లా జలాశయాలు
-ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీలు, పంపుహౌజ్‌ల వద్ద జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ గేట్లను తెరిచి ఉంచారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 12 నుంచి 75 గేట్లను పైకెత్తారు. మొత్తం 5.87 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. అన్నారం జలాశయం పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది. బ్యారేజీ నీటి మట్టం 119 మీటర్లు కాగా.. శుక్రవారం మధ్యాహ్నానికే నిండింది. అన్నారం బ్యారేజీలో 9 గేట్లను ఎత్తివేశారు. బ్యారేజీలోకి 34,774 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా..36 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగి జలాశయం నిండు కుండను తలపిస్తోంది. 5 రోజుల నుంచి కన్నెపల్లి పంపుహౌజ్‌ వద్ద పంపులు నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 4.51 టీఎంసీలు, అన్నారం వద్ద 9.25టీఎంసీలు, కన్నెపల్లి పంపుహౌజ్‌ వద్ద 8 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

నిర్మల్‌ జిల్లా కడెం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 4 గేట్లు తెరిచి 39 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నారు. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా..ప్రస్తుతం 695 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 5.5 టీఎంసీల నిల్వ ఉంది. కడెం నుంచి వస్తున్న నీటితో  ఎల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది.

భద్రాచలంలో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక
మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు గోదావరిలోకి వచ్చి చేరుతుండటంతో భద్రాచలంలో క్రమంగా వరద ఉద్ధృతి  పెరుగుతోంది. భద్రాచలంలో నీటి మట్టం 43 అడుగులకు చేరింది. స్నాన ఘట్టాల మీదుగా వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. చత్తీస్‌గఢ్‌ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తాలిపేరు జలాశయం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జలాశయం 34 గేట్లను ఎత్తివేసి 1.34 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.