Thursday, December 05, 2019
Follow Us on :

అర్చకుల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం

By BhaaratToday | Published On Feb 22nd, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్చకుల జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పురోహితులు పేదరికంలో ఉండటం తమను కలచివేసిందని, అందుకే వారి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. రూ. 5,000 పొందుతున్న అర్చకులకు జీతాన్ని రూ.8,000కు పెంచామని, రూ.10,000 జీతాలు పొందుతున్న అర్చకులకు రూ.12,500 పెంచామని సీఎం వివరించారు. 

అర్చకుల కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నది తమ ఆకాంక్ష అని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని సీఎం స్పష్టం చేశారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ సిఫారసులను అనుసరించి అన్ని దేవాలయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామన్నారు. భూ సేకరణ జరిగిన చోట, అర్చకులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అర్హత ఉన్న అర్చకులందరికీ కోడ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అన్ని దేవాలయాల్లో దూప, దీప, నైవేద్య కార్యక్రమాలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు హామీ ఇచ్చారు. జీతాలు పెంచినందుకు గానూ అర్చకులు గురువారం ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.