Thursday, December 05, 2019
Follow Us on :

అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీకి ‘మెట్రో’ సేవలు ప్రారంభం

By BhaaratToday | Published On Mar 20th, 2019

అమీర్‌పేట్ నుంచి  హైటెక్ సిటీకి మెట్రో రైలు సేవలు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న ఈ మెట్రో సేవ‌ల‌ను అమీర్‌పేట్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. మెట్రోరైలు ప్రారంభమై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా హైటెక్ సిటీ మార్గంలో శ్రీకారం చుట్టిన ట్రయల్‌రన్‌ సక్సెస్‌ అయింది. దీంతో కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ అనుమతులు మంజూరు చేయడంతో అధికారిక ప్రారంభోత్స‌వానికి ముహూర్తం ఖ‌రారైంది. మెట్రో రైల్‌ రాక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐటీ ఉద్యోగులకు..నేటి నుంచి రాకపోకలు సాగనుండడంతో ప్ర‌యాణికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. హైటెక్‌కు ప్రారంభ‌మైన ఈ మెట్రో సేవ‌లు ఈ రోజు సాయంత్రం 4గంట‌ల నుంచి సామాన్య ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది.

వాస్తవానికి అమీర్‌ పేట-హైటెక్‌ సిటీ మార్గంలో మెట్రో రైళ్ల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులతో పాటు, ఇతర కార్పొరేట్‌ కంపెనీల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నగరంలోని నలుమూలల నుంచి వీరు పనిచేసే ప్రాంతాలకు వస్తున్నారు. అనునిత్యం ట్రాఫిక్‌ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మార్గంలో రైళ్లు నడపడానికి మార్గం సుగమం కావడంతో వారికి ఎంతో ఊరట లభిస్తుంది.

అమీర్‌పేట్‌ – హైటెక్‌సిటీ మార్గంలో.. మధురానగర్‌, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గంచెరువు, హైటెక్‌ సిటీ స్టేషన్లుంటాయి. ఈ మార్గం కూడా అందుబాటులోకి రానుండడంతో ఇప్పుడు హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మెట్రో సేవలందనున్నాయి. 29 కిలోమీటర్ల మియాపూర్‌ – ఎల్బీనగర్‌ లైన్‌, 17 కిలోమీటర్ల నాగోల్‌ – అమీర్‌పేట లైన్లు ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. 10 కిలోమీటర్ల అమీర్‌ పేట-హైటెక్‌ సిటీ మార్గం కూడా మొదలవుతుండడంతో మొత్తం 56 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.