Tuesday, October 15, 2019
Follow Us on :

ఓ విదేశీ నాయకుడు పాల్గొనే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతుండడం ఇదే మొదటిసారి

By BhaaratToday | Published On Sep 22nd, 2019

హూస్టన్‌ నగరాన్ని ఇప్పటికే మోదీ మేనియా కమ్మేసింది. బాగున్నారా మోదీ అంటూ.. ప్రవాస భారతీయులు భారత ప్రధాని కోసం వేచిచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఉత్తర అమెరికాలో ఓ విదేశీ నాయకుడు పాల్గొనే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకాబోవడం ఇదే మొదటిసారి. పోప్ ఫ్రాన్సిస్ మినహా విదేశీ నేతలు పాల్గొనే సభకు గతంలో ఈ స్థాయిలో ప్రజలు హాజరు కాలేదట.

మోదీ అమెరికా పర్యటన ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పటికే పలుమార్లు అమెరికాలో పర్యటించిన ఆయన.. ఇప్పుడు మరోసారి చారిత్రక టూర్ కు సిద్ధమయ్యారు. మోదీ రాకకోసం అమెరికా ఎదురుచూస్తోంది. హ్యూస్టన్ సిటీకి మోదీ ఫీవర్ పట్టుకుంది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎన్నారైలు విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో ఎక్కడ చూసినా మోదీ కటౌట్లే దర్శనమిస్తున్నాయి. గతంలో టైమ్స్ స్క్వేర్ ను సభను తలదన్నేలా.. హ్యూస్టన్ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆరు రోజుల పర్యటనలో భాగంగా.. శనివారం అమెరికాలో అడుగుపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. ట్రంప్ తో భేటీ, ఐక్యరాజ్య సమితిలో ప్రసంగతో పాటు.. ఈసారి ప్రవాస భారతీయులు నిర్వహించే ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం.. మోదీతో వేదికను పంచుకోబోతున్నారు. 

ఈ నెల 22 న టెక్సాస్ లోని ‘టెక్సాస్ ఇండియన్ ఫోరమ్’ ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది. సుమారు 50 వేల మంది ప్రవాస భారతీయులు ‘హౌదీ మోదీ’ సభకు హాజరుకానున్నారు. ఈ ఈవెంట్ కోసం వీరంతా మూడు వారాలముందే తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. టికెట్స్ అన్నీ ఇప్పటికే ఆన్ లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అత్యంత భారీగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి.. వెయ్యిమంది వాలంటీర్లు, దాదాపు 650 స్వఛ్చంద సంస్థల సభ్యులు చేయూతనిస్తున్నారు.

యూఎస్ లోని సౌత్ వెస్టర్న్ ఏరియాలో.. ‘హౌ డూ యూ డూ’ను.. ఫ్రెండ్లీగా ‘హౌడీ’ అని అంటుంటారు. ఈ నేపథ్యంలో ‘హౌ డూ యూ డూ మోదీ’ కి షార్ట్ కట్ గా.. ఈ కార్యక్రమానికి ‘హౌదీ మోదీ’ అని పేరుపెట్టారు. టెక్సాస్ లోని హూస్టన్ లో వున్న ఎన్.ఆర్.జి. స్టేడియంలో ఈ భారీ ఈవెంట్ జరగనుంది. సెప్టెంబర్ 22 ఆదివారం.. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది.

 మోదీ ప్రసంగంతో పాటు.. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. భారత్ - అమెరికన్ల హెరిటేజ్ అండ్ డైవర్సిటీని ప్రతిబింబించేలా 90 నిముషాల సేపు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇందుకోసం 400 మంది ఆర్టిస్టులు, అమెరికా వ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ మెంబర్లతో ‘ఇండియన్ - అమెరికన్ స్టోరీ’ పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తారు. సుమారు 60 మంది ప్రముఖ ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. యుఎస్ సెనెటర్ ఫర్ టెక్సాస్ జాన్ కార్నిన్, సీనియర్ డెమొక్రటిక్ కాంగ్రెస్ మన్ స్టెనీ హోయర్ వంటి పాపులర్ ఎంపీలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు.

కశ్మీర్ లో ఆర్టికల్ 370 ని తొలగించిన తర్వాత.. అమెరికాలో ఇదే మోదీ తొలి పర్యటన కావడంతో.. ఎన్నారైలు మోదీ ప్రసంగంపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, ‘హౌదీ-మోదీ’ కార్యక్రమంలో మాట్లాడే అంశాలను సూచించాలని.. మోదీ కోరిన నేపథ్యంలో.. ‘మోదీ యాప్’ తో పాటు.. పీఎంవోకు ట్వీట్లు వెళ్లువెత్తాయి. ఇక, ‘హౌదీ-మోదీ’ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటున్నట్టు ట్రంప్ ప్రకటించడంతో.. ఇప్పుడు అందరి దృష్టి హ్యూస్టన్ పైనే వుంది. కాగా ట్రంప్ చివరిసారిగా గత ఆగస్టులో జీ7 సదస్సులో భేటీ అయ్యారు.

‘హౌదీ-మోదీ’ కార్యక్రమంలో భాగంగా.. భారత ప్రభుత్వం దేశంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాల గురించి ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో పంచుకోనున్నారు. ఇదిలావుంటే ‘హౌదీ-మోదీ’ కార్యక్రమంపై వైట్ హౌస్ స్పందించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఈ భేటీ ఉపయోగపడే అవకాశం ఉందని వైట్‌హౌస్‌ తెలిపింది. ఈసారి మోదీ అమెరికా పర్యటన ఆరు రోజులపాటు కొనసాగనుంది. హ్యూస్టన్ లో జరిగే ‘హౌదీ-మోదీ’ సమావేశంతో పాటు.. పలు సమావేశాల్లో మోదీ పాల్గొంటారు. ట్రంప్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అంతేకాదు.. ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు. 

 శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరే మోదీ.. ముందుగా హ్యూస్టన్ వెళ్తారు. అక్కడి రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొంటారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అవుతారు. అదే సమయంలో కొందరు కొందరు డెమొక్రటిక్ నేతలతో కలిసి మోదీ ప్రసంగిస్తారు. తర్వాతి రోజు 22న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోదీ పాల్గొని, ప్రసంగిస్తారు. ఆరోగ్యం, టెర్రరిజంపైనా మోదీ మాట్లాడతారు. ఆ తర్వాత హ్యూస్టన్ లోని ఎన్.ఆర్.జి. స్టేడియంలో ఎన్నారైలతో మోదీ చరిత్రాత్మక సమావేశంలో పాల్గొంటారు. 

ఎన్నారై సదస్సు తర్వాత.. ఈ నెల 23న న్యూయార్క్ వెళ్లి ఐక్యరాజ్య సమితిలో బహుముఖ చర్చల్లో పాల్గొంటారు మోదీ. 24న ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఇచ్చే విందుకు హాజరవుతారు. అలాగే ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా.. ఐక్యరాజ్య సమితిలో 150 మొక్కలు నాటే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అప్పుడే పారిశ్రామిక వేత్తలు, భారత ప్రతినిధి బృందంతో మోదీ మాట్లాడతారు. 

ఈ సందర్భంగా గాంధీ సోలార్ పార్క్, గాంధీ శాంతి ఉద్యానవనం, గాంధీ పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ లింకన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో నరేంద్ర మోదీ ‘గ్లోబల్ గోల్ కీపర్స్ గోల్ అవార్డు’ను స్వీకరిస్తారు. ఇక, ఈ నెల 27న మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. ఇండియా - పసిఫిక్ దేశాల అధినేతలు ఈ సమావేశంలో నరేంద్ర మోదీ పాల్గొంటారు. 12 మంది పసిఫిక్ దేశాల అధినేతలు, 14 మంది కరేబియన్ దేశాల అధినేతలు ఈ రెండు సమావేశాలకు హాజరవుతారు.

ఓవైపు ‘హౌదీ-మోదీ’ పర్యటనపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. విపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక వాద్రా.. ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. భారత్ ను ముంచెత్తుతున్న ఆర్ధిక సంక్షోభాన్ని సైడ్ లైన్ చేయాలంటే.. ప్రపంచంలోని వ్యవస్థలన్నీ చాలవని అన్నారు. ఇక, ‘హౌదీ-మోదీ’ టైటిల్ పై ‘హౌదీ-ఎకానమీ’ అంటూ సెటైర్లు వేశారు. 

‘హౌదీ-మోదీ’ సమావేశం జరుగనున్న హ్యూస్టన్ సిటీలో భారీగా కురుస్తున్న వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. టెక్సాస్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ప్రజలు ఇళ్లలోంచీ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించేంత పరిస్థితి వచ్చేసింది. టెక్సాస్ గవర్నర్ రాష్ట్రంలోని 13 కౌంటీల్లో రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అయినా, ఎన్.ఆర్.జి. స్టేడియంలో జరిగే ‘హౌదీ-మోదీ’ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు.. 1500 మంది వాలంటీర్లు అదే పనిగా శ్రమిస్తున్నారు. కార్యక్రమం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.