Saturday, October 19, 2019
Follow Us on :

భారీ పేలుడుకు అస‌లు కార‌ణం ఇదేనా...?

By BhaaratToday | Published On Jan 19th, 2019


హైదరాబాద్‌ నగరంలోని కాప్రాలో ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘటనలో ఇంటి యజమాని మోహన్‌లాల్‌ చౌదరి(52), వీధిలో బైకు మీద వెళ్తున్న యువకుడు ఎలగందుల రవి(32) మృతి చెందారు. మోహన్‌లాల్‌ భార్య, ఇద్దరు పిల్లలు సహా మరో ఏడుగురు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మోహన్‌లాల్‌ భార్య లీలావతి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పేలుడు తీవ్రతకు ఒకటో అంతస్తు ఇంటి గోడలు బద్దలై దూరంగా చెల్లా చెదరుగా పడిపోయాయి. ఇంట్లోని సామానంతా ఇంటి ప్రహరీ దాటి బయట పడిపోయింది. ఇంటి ఇటుకలు అర కిలోమీటరు దూరం వరకు ఎగిరిపడ్డాయి. రాజస్థాన్‌కు చెందిన నగల వ్యాపారి మోహన్‌లాల్‌ పదేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కాప్రా సాయిప్రియ కాలనీలో సొంత ఇల్లు కట్టుకొన్నారు. పైఅంతస్తులో భార్య లీలావతి(42), కుమారుడు గోవింద్‌ చౌదరి (14), కుమార్తె నిఖితా చౌదరి(11)లతో ఆయన నివాసం ఉంటున్నారు. కాప్రా శ్రీరాంనగర్‌ కాలనీలో ఆయనకు జ్యువెల్లరీ షాపు ఉంది. మోహన్‌లాల్‌ కుటుంబం గురువారం రాత్రి భోజనానంతరం నిద్రకు ఉపక్రమించింది. సిలిండర్ ఆఫ్‌ చేయకపోవడంతో రాత్రంతా గ్యాస్‌ లీకై ఇల్లంతా వ్యాపించింది. ఇది గమనించిన మొహన్‌లాల్ చౌదరి గ్యాస్ ఆఫ్‌ చేేసేందుకు వెలుతురు కోసం కరెంట్ స్విచ్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
 
ఈ ప్ర‌మాదంలో  మోహన్‌లాల్‌ పక్కింటి వారు, రోడ్డున వెళ్లేవారు ఎన్‌.వెంకటయ్యగౌడ్‌ (52), పి.లక్ష్మి (45), కమలాదేవి (40), యశ్వంత్‌రామ్‌ (20) పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పేలుడు ధాటికి ఇల్లు నలువైపులా గోడలు ధ్వంసమయ్యాయి. పైకప్పు కొంత భాగం కూలిపోయింది. వంటింట్లో గ్యాస్‌ లీకయితే ప్రమాద తీవ్రత ఇంతగా ఉంటుందా? అని స్థానికులు విస్మయానికి గురవుతున్నారు. నగల శుద్ధికి ఉపయోగించే రసాయనాలో, ఇతర పదార్థాలో ఇంట్లో ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని మేయర్‌ రామ్మోహన్‌ పరిశీలిం చారు. రవి కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు.
 
ఈ ఘ‌ట‌న‌కు గ్యాస్ లీకేజీయే కార‌ణ‌మ‌ని భావిస్తున్నాం : పోలీసు క‌మిష‌న‌ర్‌ మహేశ్‌ భగవత్‌
కాప్రాలోని పేలుడు ఘటనకు ఇంట్లో గ్యాస్‌ లీకేజీయే కారణమని భావిస్తున్నామని రాచకొండ పోలీస్‌ కమిుషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. అయితే, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. సంఘటన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంట్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ రసాయనాలు గానీ నిల్వ ఉన్న ఆనవాళ్లు లభించలేదన్నారు. సిలిండర్ ఆఫ్‌ చేయకపోవడంతో రాత్రంతా గ్యాస్‌ లీకై సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.