Monday, December 09, 2019
Follow Us on :

గూగుల్ మ్యాప్స్ లో శోభాయాత్ర.. 20 వేల విగ్రహాలు తరలి వచ్చే అవకాశం

By BhaaratToday | Published On Sep 11th, 2019

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 12 ఉదయం నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఖైరతాబాద్ మహా గణపతి రేపు నిమజ్జన యాత్ర ఉదయం 7 గంటలకల్లా ప్రారంభం అవుతుంది. అలాగే మధ్యాహ్నంలోగా నిమజ్జనం పూర్తవుతుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. గూగుల్ మ్యాప్స్ లో గణేశ్ శోభాయాత్ర కనిపిస్తుందని, నిమజ్జనం పూర్తయ్యే వరకు ఆ మార్గాన్ని గూగుల్ చూపిస్తుందని అన్నారు. నిమజ్జనానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఊరేగింపు, ట్రాఫిక్‌ స్థితిగతులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటు చేశామని అన్నారు. జీహెచ్ఎంసీ, గణేశ్ ఉత్సవ సంఘాలతో కలిసి నిమజ్జనం సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలనూ తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రతి 3 కి.మీ.లకు ఒక గణేశ్‌ యాక్షన్‌ టీమ్‌ ఉంటుందని, వివిధ విభాగాలతో జీహెచ్‌ఎంసీ కలిసి పనిచేస్తోందని అన్నారు. విద్యుత్, శానిటేషన్, జలమండలి, ఫైర్, పోలీస్‌ తదితర శాఖల సిబ్బందిని పూర్తి స్థాయిలో రంగంలోకి దించామని వెల్లడించారు. ఖైరతాబాద్‌ వినాయకుని నిమజ్జనం మధ్యాహ్నం 12 గంటల్లోగా పూర్తయ్యేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు.

శోభాయాత్ర కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. బాలాపూర్‌ నుంచి ప్రారంభమయ్యే యాత్ర చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, మదీనా, ఆఫ్జల్‌గంజ్‌, ముజాంజాహీ మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌ లిబర్టీ మీదుగా హుస్సేన్‌సాగర్‌ వరకు కొనసాగుతుంది. అందువల్ల శోభాయాత్ర జరిగే మార్గంలోకి విగ్రహాలున్న వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించరు. ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. హుస్సేన్‌సాగర్‌కు దాదాపు 20 వేల విగ్రహాలు తరలి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో నిమజ్జన కార్యకమ్రం దాదాపు 36 గంటలపాటు సాగుతుందని భావించి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌పై నుంచి నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతుంది.