Tuesday, October 15, 2019
Follow Us on :

వాట్సాప్ వ‌ల్లే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఓడిపోయాను...హైకోర్టు మెట్లెక్కిన స‌ర్పంచ్ అభ్య‌ర్థి

By BhaaratToday | Published On Jan 30th, 2019

తెలంగాణలో పంచాయ‌తీ ఎన్నిక‌లు ఈ రోజుతో మూడో విడ‌త ముగియ‌నుంది. అయితే హోరాహోరీగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తెరమీదకు విచిత్ర‌మైన‌ అంశాల్లో ఇదొకటి. తుది విడ‌త జ‌రుగుతున్న త‌రుణంలో ఓ అభ్యర్థి అనూహ్యమైన పిటిషన్‌తో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మెట్లెక్కాడు. వాట్సాప్‌ మెసేజ్ - ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన తప్పుడు ప్రచారాలతో తాను సర్పంచ్ గా ఓడిపోయాను అని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని హైకోర్టుని ఆశ్రయించాడు. కుక్క రాంచందర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓట‌మిపాలైన‌ కుక్క రాంచందర్ కథనం ప్ర‌కారం...బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం నూతన గ్రామ పంచాయితీలో సర్పంచ్ ఎన్నికల్లో రాంచందర్ పోటీలో ఉండగా ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం పలువురు వాట్సాప్ గ్రూపుల్లో సర్పంచ్ అభ్యర్థి రాంచందర్ పై ఆరోపణలు చేస్తూ మెసేజ్ తో పాటు ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేశారు. గెలుపు రేసులో ఉన్న నేను ఈ పోస్ట్ లతో నాపై తప్పుడు ప్రచారం జరగడం వల్ల ఓడిపోయాను అని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉన్న సమయం లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి నా ఓటమికి కారణం ఐన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రీ ఎలక్షన్స్ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోర్టును కోరారు. ఆయన ఫిర్యాదుపై తదుపరి వాదనల తర్వాత తీర్పు వెలువడనుంది.