Friday, July 19, 2019
Follow Us on :

ఇంగ్లండ్‌ కెప్టెన్ మోర్గాన్‌పై ఐసీసీ వేటు.. దీంతో పాటు..

By BhaaratToday | Published On May 15th, 2019

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌పై స్లో ఓవర్‌ రేటు కారణంగా ఐసీసీ నిషేధం విధించింది. దీంతో మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. దీంతో శుక్రవారం నాటి వన్డేకు మోర్గాన్ దూరం కానున్నాడు. ఈ మేరకు ఐసీసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బ్రిస్టల్‌లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు నమోదైన కారణంగా మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్‌ మోర్గాన్‌పై సస్సెన్షన్‌ విధించాడు. ఈ క్రమంలో మోర్గాన్‌ ఫీజులో 40 శాతం, జట్టు సభ్యుల ఫీజులో 20 శాతం కోత పడింది. ఇక మోర్గాన్‌ స్లో ఓవర్‌ రేటుకు కారణమవడం ఇది రెండోసారి అని ఐసీసీ పేర్కొంది. గత ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మోర్గాన్‌ ఇదే విధంగా ప్రవర్తించాడని వెల్లడించింది.

ఇదిలా ఉండ‌గా.. మూడో వన్డేలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో(128; 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో పాకిస్తాన్‌ చిత్తుచిత్తుగా ఓడింది. మరో 31 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యం పూర్తి చేసిన ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన బెయిర్‌స్టో ప్లేయర్‌ ఆఫ్‌ ద అవార్డు దక్కించుకున్నాడు. ఇక శుక్రవారం నాటింగ్‌హోం వేదికగా నాలుగో వన్డే జరుగనుంది.