Tuesday, October 15, 2019
Follow Us on :

భారత్‌తో సత్సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తానన్నాడు.. కానీ చివరికి

By BhaaratToday | Published On Sep 19th, 2019

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన పాకిస్థాన్‌ని ఒడ్డునపడేస్తానని, భారత్‌తో సత్సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తానని.. ఎన్నికల సమయంలో ఎన్నో చెప్పాడు ఇమ్రాన్ ఖాన్. పాక్ ప్రజలపై హామీల వర్షం కురిపించి.. ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేద్దామని.. పాక్ ను సమూలంగా మార్చేద్దామనుకున్న ఇమ్రాన్ కు పీఠమెక్కితే గానీ, అసలు విషయం భోదపడలేదు. అధికారంలోకి వచ్చిన మూణ్ణాళ్లకే అది ముళ్లపీఠమని అర్థమైంది.

కొంతకాలం స్నేహంతో గుర్రాలు కూడా గాడిదలవుతాయంటారు. ప్రస్తుతం పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ పరిస్థితి అలాగే వుంది. జమ్మూకశ్మీర్‌కు ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత తరచూ ఆయన నోటి నుండి యుద్ధం మాట వస్తోంది. ఆయనే కాదు ఆయన మంత్రులు కూడా భారత్‌తో భీకరమైన యుద్ధం తప్పదంటూ కలవరిస్తున్నారు.

పాకిస్తాన్‌ ప్రభుత్వంలో మిగతా మంత్రుల విషయాన్ని పక్కనపెడితే ఇమ్రాన్‌ఖాన్‌ కు కాస్త పరిణితి వున్న మాట వాస్తవం. ఆయన రాజకీయ నేపథ్యంలో నుండి రాలేదు. మత ఛాందస వాదాల మధ్య పెరగలేదు. ప్రపంచం చుట్టిన మేటి క్రికెట్‌ క్రీడాకారుడాయన. ఎక్కువ దేశాలలోని ఆటగాళ్ళతో సత్సంబంధాలున్నాయి. 

ఇమ్రాన్‌ఖాన్‌ మంచి నాయకుడే కావొచ్చు. మంచి ఆలోచ నలు వున్నవాడే కావొచ్చు. కానీ నిరంతరం ఛాందసవాదంతో పేట్రేగిపోయే ఉగ్రవాదులున్న పాకిస్తాన్‌ ఆయన మైండ్‌ సెట్‌ కు.. సెట్‌ కావడం లేదు. ఆర్థిక సంక్షోభంలో వున్న పాకిస్తాన్ ను గట్టెక్కిస్తానని.. యువతకు సరికొత్త మార్గనిర్దేశనం చేస్తానని.. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాడు ఇమ్రాన్. పాక్ ను సమూలంగా మార్చేద్దామనుకున్నాడు. కానీ, ఆయన ఆలోచనా విధానానికి తగ్గట్లుగా ఆ ఉగ్రదేశం మారడం లేదు. గత్యంతరం లేక, ఆ దేశంలోని అతివాదుల ఆలోచనా ధోరణులకు తగ్గట్లుగా ఇమ్రాన్‌ఖానే మారిపోయాడు. అందుకే ఆయన కూడా యుద్ధం యుద్ధం కలవరిస్తున్నాడు.

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం అనేది పెద్ద బూటకం. ఇక్కడ ఎన్నికల వ్యవస్థంతా కూడా పాక్‌ ఆర్మీ చేతుల్లోనే ఉంటుంది. ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలనేది కూడా ఐఎస్‌ఐ నిర్ణయిస్తుంది. ప్రధాని ఇక్కడ ఆర్మీ చేతుల్లో కీలుబొమ్మ. ఆర్మీని కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటే నవాజ్‌షరీఫ్‌, బెనజీర్‌ భుట్టో, ముషారఫ్‌లు ఎన్ని అగచాట్లు పడ్డారో చూశాం. ఇమ్రాన్‌ఖాన్‌ అందుకు అతీతుడేం కాదు. పాకిస్థాన్‌ పాలకులకు భారత విద్వేష వైఖరే ప్రధాన అర్హత. భారత్‌ మీద ఎంతగా విషం కక్కుతుంటే వారి పదవులు అంత భద్రంగా వుంటాయి. భారత్‌ పట్ల శత్రువైఖరిని కొనసాగించే పార్టీలకే అక్కడి ప్రజలు మద్దతు పలుకుతుంటారు.

పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ బాధ్యతలు తీసుకున్నాక ఆయనకు అనేక సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన దురదృష్టం ఏంటంటే భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వున్నప్పుడే ఆయన పాకిస్థాన్‌ ప్రధాని కావడం. ఏ మన్మోహన్‌సింగో ప్రధానిగా వున్నప్పుడు ఆయన పాక్‌ ప్రధాని అయ్యుంటే.. ఆయనకు ఏ సమస్యా వచ్చేది కాదేమో. 

కశ్మీర్‌ విషయంలో ప్రపంచమంతా కూడా భారత్‌వైపు నిలవడం పాకిస్థాన్‌కు ఏ మాత్రం మింగుడుపడడం లేదు. ఓ పక్క ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్‌లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది. ఈ వ్యతిరేకత నుండి బయటపడాలంటే భారత్‌ పట్ల విషం కక్కాలి. విద్వేషం పెంచుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కుర్చీ క్రిందకు నీళ్లొస్తాయి. పాపం అందుకే ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌తో యుద్ధం తప్పదేమోనంటున్నాడు. ఈ మాటల యుద్ధం చేయడానికి కాదు, కేవలం తన ఆర్మీని చల్లబరచడానికేనన్నది కాదనలేని వాస్తవం.