Monday, November 18, 2019
Follow Us on :

ఇరాన్‌ లో ఇమ్రాన్‌ ఖాన్‌ పర్యటన.. అసలు ఉద్దేశం మాత్రం వేరేనా..!

By BhaaratToday | Published On Oct 15th, 2019

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన ఒక రోజు పర్యటనలో భాగంగా ఆదివారం ఇరాన్‌ లో పర్యటించాడు. ప్రాంతీయ ప్రత్యర్థ్ధులుగా ఉన్న ఇరాన్‌, సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఆయన చొరవ చూపారు. రియాద్‌ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి 2015లో ఎమెన్‌పై దాడి, గల్ఫ్‌లో 2016లో షియా మతాధిపతి ఉరి తీత ఘటనల నేపథ్యంలో రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు సెప్టెంబరు 14న గల్ప్‌లో చమురు స్థావరాలపై దాడితో మరింత ముదిరాయి. చమురు స్థావరాలపై దాడికి ఇరాన్‌దే బాధ్యతని సౌదీ, దాని మిత్ర పక్షాలు ఆరోపించగా ఇరాన్‌ అధినేత ఈ ఆరోపణలను నిరాధారమైనవని తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే అక్టోబరు 11న ఇరాన్‌కు చెందిన చమురు ట్యాంకర్‌పై సౌదీ తీరంలోని ఎర్రసముద్రంలో దాడి జరిగింది.

ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంధి నెలకొల్పేందుకు.. తాను ఇక్కడికి వచ్చాని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ, ప్రధాని అయతుల్లా అలీ ఖొమేనీతో ప్రత్యేకంగా సమావేశమైన ఇమ్రాన్.. ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తానని అన్నాడు.

 ఇరుదేశాల మధ్య సంధికోసమే ఇరాన్ పర్యటన అని చెబుతున్న ఇమ్రాన్.. అసలు ఉద్దేశం మాత్రం వేరేనని అంటున్నారు విదేశాంగ నిపుణులు. ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్ట్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకే ఈ పర్యటనను ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ కు నచ్చజెప్పి.. తద్వారా సౌదీ మద్దతు కూడగట్టేకుందు ఇమ్రాన్ ప్లాన్ చేసినట్టు సమాచారం. బ్లాక్ లిస్ట్ సమస్యను ఎదుర్కోవడంలో పాకిస్తాన్ కు ఎన్ని దేశాలు మద్దతు పలుకుతాయో తెలియదు కానీ.. భారత్ మాత్రం, ఈ విషయంలో మరింత ఒత్తిడి పెంచుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షలను తప్పించుకోవడం పాకిస్తాన్ కు అసాధ్యమని భారత్ చెబుతోంది.

పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. అటు ఉగ్రవాదులతో వైరం పెట్టుకోలేదు. ఇటు.. అంతర్జాతీయ సమాజాన్ని ఊరడించనూ లేదు. ఇక, ఎఫ్ఏటీఎఫ్ గనుక, పాక్ ను బ్లాక్ లిస్ట్ లో పెడితే.. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడం పాక్ తరం కాదంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.