Thursday, November 14, 2019
Follow Us on :

సరిహద్దుల్లో మాటిమాటికీ యుద్ధమేఘాలు కమ్ముకంటున్న తరుణంలో..!

By BhaaratToday | Published On Oct 9th, 2019

రఫేల్ రాకతో భారత వైమానిక దళం శతృదుర్బేధ్యంగా మారనుంది. ఒక్కవైమానిక దళమే కాదు, నేవీ, పదాతిదళాలు సైతం బలోపేతమవుతున్నాయి. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుధ సంపత్తిని పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. సరిహద్దుల్లో మాటిమాటికీ యుద్ధమేఘాలు కమ్ముకంటున్న తరుణంలో.. అత్యాధునిక ఆయుధాలు భారత్ కు అత్యవసరంగా మారాయి. ఈ అవసరాన్ని గుర్తించారు కాబట్టే.. ప్రధాని మోడీ వివిధ దేశాలతో అత్యాధునిక ఆయుధ ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అటు దేశీయంగా కూడా అత్యాధునిక ఆయుధాలను తయారుచేసుకుంటున్న భారత్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన దేశాల జాబితాలో చేరిపోయింది.

భారత్, పాకిస్తాన్ ల మధ్య మరోసారి యుద్ధమే వస్తే.. దాయాది దగ్గరున్న ఆయుధ సంపత్తి మూడురోజులకు కూడా సరిపోదు. అలాంటి సైనిక సంపత్తితో ఇప్పుడు ఆ దేశం విర్రవీగుతోంది. భారత త్రివిధ దళాలు, ఆయుధ శక్తికి.. పాక్ సైనిక పాటవం ఏమాత్రం సాటిరాదు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఆయుధ సంపత్తికలిగిన దేశాల్లో ఒకటి. దేశ రక్షణ విషయంలో చాలా పురోగతి చెందిన దేశం. ఆసియా ఖండంలో చైనా తర్వాత బలమైన సైనిక సామర్థ్యం కలిగిన దేశం.

అణ్వాయుధాల దగ్గరి నుండి బ్రహ్మోస్ వరకు, మిస్సైల్స్ దగ్గరి నుండి ధృవ్ లాంటి క్షిపణుల వరకు సర్వఆయుధ సంపన్న దేశం భారత్. మన సైనిక బలం ముందు, పాకిస్థాన్ ఏమాత్రం నిలువలేదు. పాకిస్థాన్ దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు, సైనిక బలం మహా అయితే మూడు రోజులు మాత్రమే భారత్ ను నిలవరించగలవు. తర్వాత పాకిస్థాన్ కోసం పోరాడేందుకు సైనికులు ఉండరు.. వాడేందుకు ఆయుధాలు కూడా ఉండవు. కానీ, భారత్ తన వద్దనున్న సైనిక, ఆయుధ సంపత్తితో ఏకధాటిగా 40 రోజులు పోరాటం చేయగలదు.

పాకిస్తాన్ యుద్ధానికి కాలుదువ్వుతున్న నేపథ్యంలో.. భారతదేశం గనక సహనం కోల్పోయి వార్ కు సై అంటే..? దానికి ప్రతిగా పాక్‌ తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే..? మరోసారి యుద్ధం వస్తే ఎవరి సత్తా ఎంత..? ఎవరి బలం ఎంత..? ఇప్పుడు ఇదే అశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

ప్రపంచంలో అణుబాంబులు ఎక్కువ కలిగి ఉన్న దేశం రష్యా. ఆ దేశం వద్ద 6,490 అణుబాంబులు ఉన్నాయి. దీని తర్వాత అమెరికా వద్ద 6,185 ఉన్నాయి. అలాగే ఫ్రాన్స్ వద్ద 300 - బ్రిటన్ వద్ద 200 అణుబాంబులు ఉన్నాయి. చైనా వద్ద 290 అణుబాంబులు ఉంటే.. పాకిస్తాన్ వద్ద 160 - భారత్ వద్ద 140 దాకా ఉన్నట్లు ఒక అంచనా. దీని బట్టి చూస్తే భారత్ కంటే పాక్ వద్దే ఎక్కువ అణుబాంబులు కలిగివున్నాయి. అణుబాంబులు తక్కువ ఉన్నా.. వాటిని ప్రయోగించడంలో భారత్ కు గట్టి సత్తా ఉంది. అణుశక్తి బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ - నేల - నింగి - సముద్రం నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే శక్తి భారత్ కు ఉంది.  భారత్ వద్ద తొమ్మిది రకాల క్షిపణులు ఉన్నాయి. వీటిల్లో మూడు వేల నుంచి అయిదు వేల కిలోమీటర్ల దూరం ప్రయోగించే అగ్ని-3 క్షిపణి కూడా ఉంది. 

భారత సైనిక బలగం 13 లక్షల 62 వేలు. వీరికి తోడు, 28 లక్షల 44 వేల రిజర్వుడ్ సైన్యం వుంది. అదే పాకిస్తాన్ వద్ద కేవలం 6 లక్షల 37 వేల సైన్యం వుంది. వీరికి తోడు 2 లక్షల 87 వేల రిజర్వుడ్ సైన్యం వుంది. ఇక భారత్ వద్ద 2 వేల 185 యుద్ధ విమానాలుంటే పాక్ దగ్గర ఉన్నది కేవలం 1,281. హెలికాప్టర్లు భారత్ వద్ద 720 ఉంటే... పాక్ వద్ద 328 వున్నాయి.

మనవద్ద 346 ఎయిర్ పోర్టులు వుంటే.. పాకిస్తాన్ వద్ద 151 ఎయిర్ పోర్టులున్నాయి. భారత్ దగ్గర 4 వేల 426 యుద్ధ ట్యాంకులు వుంటే.. పాకిస్తాన్ వద్ద వున్నవి 2,182. సాయుధ పోరాట వాహనాలు మనదగ్గర 3,147 వుంటే.. పాక్ దగ్గర 2,604 వున్నాయి. ఇక శతఘ్నుల విషయంలో కూడా మనదే పైచేయి. మనవద్ద 4,158 శతఘ్నులు వుంటే.. శత్రుదేశం దగ్గర కేవలం 1240 మాత్రమే వున్నాయి. ఇక రాకెట్ ప్రొజెక్టర్లు భారత్ వద్ద 266 వుంటే.. పాకిస్తాన్ దగ్గర 144 వున్నాయి.

పదాతి, వైమానిక దళం విషయంలోనే కాదు, నౌకాదళం విషయంలోనూ మనమే ఎక్కువ ఆయుధ సంపత్తి కలిగివున్నాం. మనవద్ద 2 విమాన వాహక నౌకలుంటే.. పాకిస్తాన్ సంఖ్య జీరో. మనవద్ద 16 సబ్ మెరైన్లు, 14 యుద్ధ నౌకలు, 11 విధ్వంసన నౌకలు, 22 చిన్న యుద్ధ నౌకలు, 139 గస్తీ నౌకలుటే.. పాకిస్తాన్ దగ్గర 5 సబ్ మెరైన్లు, 10 యుద్ధ నౌకలు, 11 గస్తీ నౌకలు మాత్రమే వున్నాయి.

రక్షణ బడ్జెట్ విషయంలోనూ మనదే పైచేయి. గత ఏడాది అంటే 2018 లో భారత్ సైనిక బడ్జెట్ కింద నాలుగు 4 లక్షల కోట్లు కేటాయించింది. ఇది దేశ జీడీపీలో 2.1 శాతం. పాకిస్తాన్ తన సైన్యం కోసం గత ఏడాది లక్షా 26 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది ఆ దేశ జీడీపీలో 3.6 శాతం. రక్షణ బడ్జెట్ విషయంలోనూ మనదే పైచేయి. ఇలా అన్ని విషయాల్లోనూ ముందంజలో ఉన్న మనతో పోరాటానికి దిగితే.. మరోసారి పాక్ భంగపాటు తప్పదనేది నిపుణుల విశ్లేషణ.

భారత్ ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ ఆయుధ సంపత్తి ఏమాత్రం సరితూగదు. ఇటీవలికాలంలో భారత్ ప్రపంచంలోనే అత్యాధునిక ఆయుధాలను సొంతం చేసుకుంటోంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుధ శక్తిని బలోపేతం చేసే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో భారత్ అమ్ములపొదిలో అత్యాధునిక ఆయుధాలు ఒక్కొక్కటిగా వచ్చి చేరుతున్నాయి. ఇటీవల అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లు భారత్ కు చేరుకున్నాయి. ప్రంపచంలోనే అత్యాధునిక మల్టీపర్పస్ హెలికాప్టర్ ఇది. ఎలాంటి భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లోనైనా దూసుకుపోగలదు. గగనతలంలో అద్భుత విన్యాసాలు చేస్తూ.. శత్రువుపై బాంబుల వర్షం కురిపించగలదు. 

వైమానిక దళమే కాదు.. అటు నేవీ కూడా మరింత బలోపేతమైంది. ఇటీవల ఐఎన్ఎస్ ఖండేరీ, ఐఎన్ఎస్ నీలగిరి వంటి అత్యాధునికి ఆయుధాలు జలప్రవేశం చేశాయి. ఐఎన్ఎస్ ఖండేరీ జలాంతర్గామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాడార్లకు అందకుండా శత్రువును ముప్పుతిప్పలు పెట్టడం దీని ప్రత్యేకత. శ‌త్రువులు వ‌దిలే టార్పిడోల‌ను అత్యంత కచ్చితత్వంతో ఇది ధ్వంసం చేయ‌గ‌లదు. సెకండ్ క‌ల్వరి క్లాస్‌కు చెందిన‌దే ఈ జ‌లాంత‌ర్గామికి.. భ‌యాన‌క స్వార్డ్ టూత్ ఫిష్ అనే చేప పేరుమీద ఖండేరి అని నామకరణం చేశారు. ఇక, ఐఎన్ఎస్ ఖండేరీతో పాటు.. అదే రోజు జలప్రవేశం చేసిన.. మరో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ నీలగిరి. శత్రువుపై నిరంతరం కన్నేసి వుంచే అత్యాధునిక పరిజ్ఞానం ఈ యుద్ధ నౌక సొంతం.

 భారత నేవీలో అత్యంత ప్రమాదకర వార్ షిప్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ప్రధాని మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే.. 2014 జూన్ 14న ఐఎన్ఎస్ విక్రమాదిత్యను లాంఛనంగా భారత నౌకాదళానికి అందజేసి, జాతికి అంకితం చేసారు. ఈ ప్రపంచశ్రేణి వార్ షిప్.. పాకిస్తాన్ నే కాదు.. చైనాకు సైతం వణుకుపుట్టిస్తోంది. హిందూ మహా సముద్రంలో అణువణువునూ కనిపెట్టుకోగలిగే సత్తా దీని సొంతం. ఈ వార్ షిప్.. భారత్ దగ్గరున్న ప్రతి యుద్ధ విమానానికి ఆశ్రయం ఇవ్వగలదు. ప్రతి అణ్వాయుధాన్ని ఈ వార్ షిప్ నుంచి ప్రయోగించవచ్చు.

ఓవైపు విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తూనే.. మరోవైపు దేశీయంగా ఆయుధ తయారీపై భారత్ దృష్టిపెట్టింది. ఇప్పటికే యుద్ధ విమానాలను కూల్చే క్షిపణులను తయారీకి భారత రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల సహకారంతో డీఆర్డీవో “అస్త్ర” క్షిపణులను తయారు చేసింది. ఇవి గగన తలం నుంచి గగన తలం టార్గెట్‌లను చేధిస్తుంది. ఇప్పటికే వాయుసేన పలు క్షిపణి ప్రయోగాలు చేసి విజవంతమైంది. ఇటీవలే మరో క్షిపణి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది. ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణి అయిన “అస్త్ర” పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

ఇక ఇప్పటికే అమెరికా నుంచి హొవిట్జర్ వంటి శతఘ్నులు తెప్పించుకున్నాం. కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కుట్రలను ఇవి పకడ్బందీగా చేధిస్తాయి. గరిష్ఠంగా 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా, వేగంగా ఛేదించే హోవిట్జర్ గన్స్ రాకతో సైనిక సామర్థ్యం మరింతగా పెరిగింది. అటు అణ్వాయుధాలను ప్రయోగించగల.. ఎస్-400 రష్యా నుంచి రాబోతున్నాయి. వీటిని సరిహద్దుల్లో మోహరిస్తే.. పాక్ కు ముచ్చమటలు ఖాయమంటున్నారు రక్షణ నిపుణులు. 

అటు భారత పదాతిదళాన్ని బలోపేతం చేసే విధంగా.. అత్యాధినిక ఆయుధ ఒప్పందాలు చేసుకుంది భారత్. వాటిలో పవర్ ఫుల్ హ్యాండ్ గ్రానైడ్, స్పైస్ 2000 బంకర్ బ్లాస్ట్ బాంబర్లు వున్నాయి. ఇక, గతంలో ఇజ్రాయిల్ తో బరాక్ క్షిపణుల ఒప్పందం కూడా భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే ఒప్పందమే. ఇంతటి సైనిక శక్తి కలిగిన భారత్ తో పాక్, చైనాలు పరాచికాలాడుతున్నాయి. ఆ దేశాల పరాచికాలు హద్దుమీరితే.. భారత్ ఆయుధపూజకు సిద్ధమవ్వడం ఖాయం.. అదే జరిగితే ప్రపంచ పటంలో ఉగ్రదేశం పాకిస్తాన్ గల్లంతే.