Friday, July 19, 2019
Follow Us on :

పాక్ ఆ కార్య‌క్ర‌మం చేప‌డితే.. భార‌త్ సాయం చేస్తుంది!

By BhaaratToday | Published On May 15th, 2019

పాకిస్థాన్‌ తమ దేశంలోని ఉగ్రవాదులను ఏరివేసే కార్య‌క్ర‌మం చేప‌డితే.. ఆ కార్య‌క్ర‌మానికి పాక్ కు భారత్ సాయం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఇటీవ‌ల పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. తమ దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని పాకిస్థాన్‌ ప్రకటించాలి. అవసరమైతే భారత్‌ కూడా సాయం చేస్తుంది. ఇటువంటి ప్రకటన పాక్‌ నుంచి వస్తే ఇమ్రాన్‌ ఖాన్ నిజంగానే మోదీ అభిమాని అని‌ మేము నమ్ముతామని. అలాగే, భారత్‌తో పాక్‌ సత్సంబంధాలు కోరుకుంటోందని భావిస్తాము’ అని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

2014లో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను ఆహ్వానించడంపై రాజ్‌నాథ్‌ స్పందిస్తూ... ‘మేము ఓ ప్రయోగం చేద్దామనుకున్నాం.. కానీ, మేము అనుకున్న విధంగా జరగలేదని రాజ్‌నాథ్‌ సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే ప్రమాణ స్వీకారోత్సవానికి మరోసారి పాక్‌ ప్రధానిని ఆహ్వానిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఎవరిని పిలుస్తాం?.. ఎవరిని దూరంగా ఉంచుతాం? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. 

భారత్‌లో మరోసారి ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పాటైతే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉంటుందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మోదీ స్నేహితుడంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేఫ‌థ్యంలో విప‌క్షాల వ్యాఖ్య‌ల‌పై రాజ్‌నాథ్ సింగ్ పై విధంగా స్పందించారు.