Thursday, November 14, 2019
Follow Us on :

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సొంతం చేసుకోడానికి భారత్ మరో అడుగు ముందుకేసింది

By BhaaratToday | Published On Oct 9th, 2019

ఇప్పటికే కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత్ పాకిస్థాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. భారత్ ను అంతర్జాతీయంగా ఇరుకున పెట్టాలని పాకిస్థాన్ ఎంతగా భావిస్తున్నా కూడా వీలుపడడం లేదు. ఇప్పటికే కశ్మీర్ విషయంలో ఓడిపోయామని పాకిస్థాన్ ఒప్పేసుకుంది. ఇక భారత్ తర్వాతి స్టెప్ ఒకటే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సొంతం చేసుకోవడమే..! ఎందుకంటే దేశ విభజన జరిగినప్పుడు పాకిస్థాన్ భారత భూభాగమైన కాశ్మీర్ ను ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే.. అందుకే మోదీ సర్కార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సొంతం చేసుకోడానికి అడుగులు మొదలు పెట్టింది.    

పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)  ప్రజలంతా భారతీయులేనని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారత్ ఎప్పటి నుండో చెబుతోంది. ఆ విషయం ప్రపంచదేశాలకు అర్థమయ్యేలా భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పీవోకే నుంచి వచ్చి జమ్ముకశ్మీర్ లో నిరాశ్రయులుగా, శరణార్థులుగా బతుకుతున్న 5,300 కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు సిద్ధమైంది. ఒక్కో శరణార్థి కుటుంబానికి రూ. 5.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలనే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, పీవోకే నుంచి వచ్చిన కుటుంబాలు జమ్ముకశ్మీర్ లో ఆశ్రయం పొందాయని చెప్పారు. మొత్తం 5,300 కుటుంబాలను పునరావాస ప్యాకేజీలో చేర్చామని ఆయన అన్నారు. ఈ విషయం తెలిసి పాకిస్థాన్ ఇప్పటికే భగ్గుమంటోంది. శరణార్థులకు మంచి జీవితం ఇవ్వాలని భారత్ భావిస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం పీవోకే ప్రజలను తీవ్రవాదం వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ సైన్యాన్ని పీవోకే నుండి వెళ్లిపొమ్మని చెబుతూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.. ఇక వారిని ఆదుకుంటామని భారత్ ముందుకు వస్తుండడం పాకిస్థాన్ కు మింగుడుపడడం లేదు.