Wednesday, October 16, 2019
Follow Us on :

భారత్, పాక్ మధ్య మ్యాచ్ నిజంగా రద్దవుతుందా..?

By BhaaratToday | Published On Feb 21st, 2019

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే క్రికెట్‌ ప్రపంచమంతా విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంది. క్రికెట్లో ఇంతకంటే ఉత్కంఠ రేకెత్తించే మ్యాచ్‌ మరొకటి ఉండదు. అందులోనూ పదేళ్ల కిందట ముంబయి దాడుల అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోవడంతో ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లపై ఆసక్తి మరింత పెరిగింది. మే నెలాఖర్లో ఇంగ్లాండ్‌లో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో రెండు జట్ల మధ్య పోరు కోసం కోట్లాది మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే జూన్‌ 16న జరగాల్సిన ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో భారత్‌ ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడకూడదంటూ కొన్ని రోజుల కిందట సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ డిమాండ్‌ చేశాడు. అప్పుడు ఈ విషయాన్ని తేలిగ్గానే తీసుకున్నారు. కానీ ఈ డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. సౌరభ్‌ గంగూలీ, అజహరుద్దీన్‌ సహా పలువురు మాజీ కెప్టెన్లు పాకిస్థాన్‌తో క్రికెట్‌ సంబంధాల్ని పూర్తిగా తెంచుకోవాలని అభిప్రాయపడుతుండటం గమనార్హం. దీంతో ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు బీసీసీఐ ఈ విషయంపై సీరియస్‌గా దృష్టిపెట్టే పరిస్థితి కనిపిస్తోందిప్పుడు. ప్రపంచకప్‌లోనూ పాక్‌తో తలపడకూడదన్న డిమాండ్లో అర్థం ఉందంటూ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించడం, ప్రభుత్వం ఆదేశిస్తే పాక్‌తో మ్యాచ్‌ నుంచి వైదొలుగుతామని బీసీసీఐ పేర్కొనడం.. ఈ మ్యాచ్‌ జరగడంపై అనుమానాల్ని పెంచేదే. ‘‘ప్రపంచకప్‌ దగ్గర పడ్డాకే ఆ టోర్నీలో పాకిస్థాన్‌తో తలపడటంపై స్పష్టత వస్తుంది. భారత జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదని ప్రభుత్వం భావిస్తే మేం ఆడం. పాక్‌తో తలపడకుంటే పాయింట్లు ఆ జట్టుకు వెళ్తాయి. కానీ ఆ జట్టుతో ఫైనల్‌ ఆడాల్సి వస్తే.. కప్పే వారికి వెళ్తుంది. ప్రస్తుతానికి ఈ విషయంలో ఐసీసీతో సంప్రదింపులేమీ జరపట్లేదు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పడం గమనార్హం. పాక్‌తో మ్యాచ్‌ నుంచి వైదొలిగితే భారత్‌ ఓడినట్లవుతుంది. దీనికి తోడు ఐసీసీకి భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని, నిషేధం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్న చర్చ కూడా నడుస్తోంది. ఐతే సభ్య దేశాల భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మ్యాచ్‌ నుంచి తప్పుకునే హక్కు భారత్‌కుందని బీసీసీఐ అంటోంది. వచ్చే వారం దుబాయ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగే అవకాశముంది. పాక్‌తో మ్యాచ్‌ నుంచి తప్పుకోవడంపై బీసీసీఐ తమ వాదన వినిపించవచ్చని అంటున్నారు. ఐతే పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఉద్విగ్నభరిత పరిస్థితుల నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ నుంచి భారత్‌ వైదొలగాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయని.. ప్రపంచకప్‌ దగ్గర పడే సమయానికి పరిస్థితులు మారి ఈ డిమాండ్‌ తగ్గుముఖం పట్టొచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.