Wednesday, October 16, 2019
Follow Us on :

జయరామ్‌కు విష‌మిచ్చి చంపేశారా..? పోలీసుల అనుమానం..!

By BhaaratToday | Published On Feb 2nd, 2019

హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడకు వెళుతూ, మార్గ మధ్యంలో తన సొంత కారులో వ్యాపార‌వేత్త‌ చిగురుపాటి జయరామ్ మృతిపై పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. అయితే జ‌య‌రామ్‌పై విష ప్రయోగం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా, ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. అయితే, ఆయన మృతదేహం నీలిరంగులోకి మారింది. ఈ విషయాన్ని ఈ ఉదయం గుర్తించిన పోలీసులు, విషమిచ్చి ఆయన‌ను చంపి ఉంటార‌ని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే అసలు విషయం తెలుస్తుందని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు జూబ్లీహిల్స్‌లోని జ‌య‌రామ్ ఇంటికి చేరుకుని ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తున్నారు. జ‌య‌రామ్ వ్యాపార లావాదేవీలు, కుటుంబ సంబంధాలు, వ్య‌క్తిగ‌త వివాదాల కోణంలో విచార‌ణ చేప‌డుతున్నారు. జ‌య‌రామ్ ఇంటి ప‌రిస‌రాల్లో ఉన్న సీసీటీవీ పుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల‌ను, బంధుమిత్రుల‌ను ప‌లు అంశాల‌పై పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.


కాగా, కృష్ణాజిల్లా, నందిగామ సమీపంలోని ఐతవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన నిన్న తెల్లవారుజామున జయరామ్ మృత దేహం కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జయరామ్ మేనకోడలు, ఆయన నడిపిన టీవీ చానల్ ఎండీ శిఖా చౌదరిని నిందితురాలిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం జయరామ్ తల్లి మరణించగా, నాటి నుంచి ఆస్తి గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.