Monday, December 09, 2019
Follow Us on :

మన దేశాన్ని ఎవరూ నమ్మడం లేదంటూ పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

By BhaaratToday | Published On Sep 12th, 2019

కాశ్మీర్ లో ఇకపై పాకిస్థాన్ పప్పులు ఉడకకుండా ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే..! ఈ అంశంపై పాకిస్థాన్ భారత్ ను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నా అది పాకిస్థాన్ తరం కావడం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే భారత్ మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాడు. కానీ అతడి కపట నాటకాన్ని ప్రపంచదేశాలు నమ్మడం లేదు. ప్రపంచదేశాల ముందు పాకిస్థాన్ ప్రతిష్ట కోల్పోయిందని.. తన ఆత్మను వెతుక్కోవాల్సి ఉందని ఓ సీనియర్ నేత అన్నారు. 

పాకిస్థాన్ కు ఇతర దేశాలు మద్దతు రాకపోవడంపై ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి బ్రిగేడియర్ (రిటైర్డ్) ఇజాజ్ అహ్మద్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ చెబుతున్న ఏ మాటలను కూడా ప్రపంచ దేశాలు నమ్మడం లేదని.. కేవలం భారత్ చెబుతున్న విషయాలనే నమ్ముతోందని ఆయన చెప్పుకొచ్చారు.  పాకిస్థాన్ ఇమేజ్ ను గత పాలకులు దెబ్బతీశారని అన్నారు. అంతర్జాతీయంగా ప్రజలెవరూ పాక్ ను నమ్మడం లేదని ఇజాజ్ చెప్పారు. భారత్ చెప్పే మాటలనే అందరూ వింటున్నారు. పాకిస్థాన్ ఒక బాధ్యతాయుతమైన దేశం కాదని అందరూ నమ్ముతున్నారు. మన ప్రతిష్టను మనం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.