Tuesday, May 21, 2019
Follow Us on :

నాలుగోసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌

By BhaaratToday | Published On May 13th, 2019

హైదరాబాద్‌లో ఉప్ప‌ల్ స్టేడియంలో రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై విజేతగా నిలిచి నాలుగోసారి ట్రోఫీని కైవ‌సం చేసుకుంది. ఐపీఎల్‌లోని అసలైన మజాను పంచుతూ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం ముంబైనే వరించింది. చెన్నై బౌలర్లు పోటీలు పడి వికెట్లు తీస్తుంటే ముంబై విలవిల్లాడింది. ఒకానొక దశలో 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. మెరుపులు మెరిపిస్తాడని ఆశలు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా 16 పరుగులకే వెనుదిరగడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 

మరోవైపు క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరుతుండడంతో ముంబై ఓటమి అప్పుడే ఖరారైనట్టు భావించారు. చివరికి కీరన్ పొలార్డ్ పుణ్యమా అని మొత్తానికి 149 పరుగుల స్కోరు సాధించింది. 25 బంతులు ఎదుర్కొన్న పొలార్డ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. జట్టులో ఈ స్కోరే అత్యధికం కావడం గమనార్హం. డికాక్ 29, రోహిత్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 15, ఇషాన్ కిషన్ 23 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీసుకోగా, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  

ఇక, ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు అభిమానులను మునివేళ్లపై నిలబడేలా చేసింది. నరాల తెగే ఉత్కంఠకు దారితీసింది. చివరి రెండు ఓవర్లలో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం కాగా, చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. దీంతో ధోనీ సేన సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. అయితే, ఒక్కో బంతీ పడుతున్న కొద్దీ అంచనాలు తారుమారయ్యాయి. వికెట్లు టపటపా పడిపోవడంతో చెన్నై అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 

ఇక, చివరి ఓవర్లో విజయానికి కావాల్సింది 9 పరుగులే. క్రీజులో వాట్సన్ ఉండడంతో చెన్నై విజయం నల్లేరు మీద నడకేనని భావించారు. కానీ, మలింగ వేసి ఆఖరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో నాలుగు పరుగులే వచ్చాయి. ఐదో బంతికి రెండో పరుగు తీసే క్రమంలో వాట్సాన్ రనౌట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం కాగా, ఐదో బంతికి రెండు పరుగులే వచ్చాయి. ఆఖరి బంతికి విజయానికి రెండు పరుగులే అవసరం. కానీ శార్దూల్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై అభిమానులు స్టేడియంలో హోరెత్తించారు. ఒకే ఒక్క పరుగు ముంబై జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోవడం ముంబైకి ఇది నాలుగోసారి. జస్ప్రిత్ బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఐపీఎల్ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందుకోగా, రన్నరప్ చెన్నై రూ.12.5 కోట్లు అందుకుంది.

ముంబాయి: డికాక్‌ (సి) ధోని (బి) శార్దూల్‌ 29; రోహిత్‌ (సి) ధోని (బి) చాహర్‌ 15; సూర్యకుమార్‌ (బి) తాహిర్‌ 15; ఇషాన్‌ (సి) రైనా (బి) తాహిర్‌ 23; కృనాల్‌ (సి) అండ్‌ (బి) శార్దూల్‌ 7; పొలార్డ్‌ నాటౌట్‌ 41; హార్దిక్‌ (ఎల్బీ) (బి) దీపక్‌ చాహర్‌ 16; రాహుల్‌ చాహర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) దీపక్‌ చాహర్‌ 0; మెక్లెనగన్‌ రనౌట్‌ 0; బుమ్రా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3; 

మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149
వికెట్ల పతనం: 1-45, 2-45, 3-82, 4-89, 5-101, 6-140, 7-140, 8-141; 
బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-1-26-3; శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-37-2; హర్భజన్‌ 4-0-27-0; బ్రావో 3-0-24-0; ఇమ్రాన్‌ తాహిర్‌ 3-0-23-2; జడేజా 2-0-12-0 

చెన్నై: డుప్లెసిస్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) కృనాల్‌ 26; వాట్సన్‌ రనౌట్‌ 80; రైనా ఎల్బీ (బి) దీపక్‌ చాహర్‌ 8, రాయుడు (సి) డికాక్‌ (బి) బుమ్రా 1; ధోని రనౌట్‌ 2; బ్రావో (సి) డికాక్‌ (బి) బుమ్రా 15; జడేజా నాటౌట్‌ 5; శార్దూల్‌ ఠాకూర్‌ ఎల్బీ (బి) మలింగ 2; ఎక్స్‌ట్రాలు 9; 
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 148; 
వికెట్ల పతనం: 1-33, 2-70, 3-73, 4-82, 5-133, 6-146, 7-148; 
బౌలింగ్‌: మెక్లెనగన్‌ 4-0-24-0; కృనాల్‌ పాండ్య 3-0-39-1; మలింగ 4-0-49-1; బుమ్రా 4-0-14-2; రాహుల్‌ చాహర్‌ 4-0-14-1; హార్దిక్‌ పాండ్య 1-0-3-0