Saturday, August 24, 2019
Follow Us on :

తోకముడుస్తున్న ఐసిస్ ఉగ్రభూతం ... ఖేల్ ఖతం

By BhaaratToday | Published On Mar 15th, 2019

మోసుల్, రఖా చేజారాయి. తిక్రిత్, గౌటా దూరమయ్యాయి. చివరి పట్టణం బాగౌజ్ నుంచి కూడా పలాయనం. ఓవైపు ఎస్డీఎఫ్ సంకీర్ణ సేనలు. మరోవైపు సిరియా దళాలు. ఉగ్రభూతంపై అలుపెరుగని పోరాటం. సిరియాలో ఇక ఐసిస్ అంతం. ఖేల్ ఖతం..!.. ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రభూతం అంతర్దాన దశకు చేరుకుంది. ఇరాక్, సిరియాలో రక్తపుటేరులు పారించిన ఐసిస్ ముష్కరులు పలాయనం చిత్తగిస్తున్నారు. ఓవైపు కుర్దిష్ సేనలు, మరోవైపు ఇరాక్, అమెరికా సంకీర్ణ దళాల ముప్పేట దాడులతో బతుకు జీవుడా అంటూ కాళ్లకు బుద్దిచెబుతున్నారు. ఇరాక్, సిరియా దేశాల్లో అత్యధిక భూభాగాన్ని ఆక్రమించుకుని.. అరాచక పాలన సాగించిన ఐసిస్ ఉగ్రవాదులు లొంగుబాటు బాట పట్టారు. ప్రస్తుతం ఓ చిన్న గ్రామానికి పరిమితమైన ముష్కరుల ఏరివేతలో ఎస్.డి.ఎఫ్. దళాలు నిమగ్నమయ్యాయి. అసలు ఐసిస్ ఉగ్రభూతం ఎలా పుట్టింది..? ఎలా బలోపేతమైంది..? ప్రపంచాన్ని గడగడలాండించిన ఐసిస్.. కేవలం పదేళ్లలోనే ఎలా పతనం అంచుకు చేరుకుంది..? ఐసిస్ ఓమికి కారణాలేంటి..? అంతర్జాతీయంగా ఎంతో బలమైన ఆర్థికంగా బలమైన ఉగ్రవాద సంస్థ ఎలా మట్టికరిచింది..? ఐసిస్ అంతంతో సిరియాలో శాంతి నెలకొన్నట్టేనా..? ఇక సిరియన్లకు ముష్కర బాధలు తప్పినట్టేనా..? అంటే.. కాదనే చెప్పాలి. సంకీర్ణ దళాలు ఐసిస్ ముష్కరులను అంతమొందించారు కానీ,.. ఇంకా ఆ ఉగ్రవాద భావజాలం బతికేవుంది. ఆ భావజాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టిప్పుడే.. ఐసిస్ అడుగుజాడలు అంతమవుతాయి.

ఉగ్రవాదం ఉగ్రవాదమే

ప్రాణాలు తీయడం, తీసుకోవడం తప్పిస్తే దాని వల్ల జరిగే మంచేమీ ఉండదు. ఆ విషయం తెలియని యువత కొందరి స్వార్థం ఫలితంగా తప్పడు మార్గంలోకి వెళ్లి బలైపోతున్నారు. పశ్చిమాసియా నుంచి కశ్మీర్ వరకు గత దశాబ్ది కాలంలో లక్షల మంది ఉగ్రవాదానికి, దానిపై అగ్రరాజ్యాలు జరిపిన దాడులకు బలైపోయారు. కానీ, ప్రస్తుతం దృశ్యం మారుతోంది. ఉగ్రవాదులు తమ స్థావరాలపై పట్టుకోల్పోతున్నారు. ఐసిస్‌కు అడ్డగా మారి, వరల్డ్ టెర్రర్ కు కేంద్ర బిందువు అనిపించుకున్న సిరియాలో ఉగ్రవాదులు చేతులెత్తేశారు. వందల సంఖ్యలో లొంగిపోతున్నారు. తాము చెరపట్టిన ప్రాంతాల్లోని అమ్మాయిలను పెళ్లి చేసుకున్న టెర్రరిస్టులు భార్యాపిల్లలతో కలసి పోలీసుల వద్ద చేతులెత్తి నిల్చుంటున్నారు. బాగౌజ్‌లో ఉగ్రవాదులు ఏకంగా 36 లారీల్లో వచ్చిన లొంగిపోయారు. అమెరికా దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఐసిస్ ఉగ్రవాదులు.. బతుకు తీపితో తుపాకీ వదిలిపెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఐసిస్ చెరలో వున్న చిన్న గ్రామం బాగౌజ్ నుంచి కూడా ఐసిస్ ఉగ్రవాదలు పలాయనం చిత్తగిస్తున్నారు. ఇక్కడ పదిరోజుల క్రితం 500 ఐసిస్ ఉగ్రవాదులు ఎస్.డి.ఎఫ్. దళాల ముందు లొంగిపోయారు. అంతేకాదు, ఆ ప్రాంతం నుంచి 3 వేల 500 మంది ప్రజలను తరలించారు. ఇంకా కొద్దిస్థాయిలో మాత్రమే అక్కడ ఐసిస్ ముష్కరులు పొంచివున్నారు. త్వరలోనే వారిని కూడా అంతమొందించేందుకు ఎస్.డి.ఎఫ్. సంకీర్ణ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.  ఇటీవలికాలంలో ఐసిస్ చెరలో వున్న ఒక్కో ప్రాంతాన్ని ఎస్.డి.ఎఫ్. దళాలు స్వాధీనపరుచుకున్నాయి. గత జనవరిలో కాలిపట్‌ లోని సరిహద్దును దాటిన ఈ దళాలు ఐఎస్ ఆధీనంలో ఉన్న అతి ముఖ్యమైన రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది అమెరికా సహకారంతో సిరియాలోని ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉభ్న యుపరేట్స్ వాలీలో అధికంగా ఉన్న జిహాదీలను సిరియన్ డెమోక్రాటిక్ ఫోర్స్ అణచివేసింది. వ్యవసాయ భూమి అధికంగా ఉన్న బాగౌజ్ గ్రామాన్ని ఆక్రమించుకుని తిష్టవేసిన జీహాదీలను ఎస్‌డిఎఫ్ దళాలు అక్కడి నుంచి తరిమికొట్టాయి. చాలామంది పారిపోగా, వేలాది మంది లొంగిపోయారు. గ్రామంలో మహిళలు, వృద్ధులు, పిల్లలు కలిసి 4,900 మంది ఉండగా, వీరిలో ఐఎస్ ఉగ్రవాదులు 470 మంది వరకు ఉన్నారని, వీరిలో 3500 మంది ముందుగానే లొంగిపోయారు. వీరిని ట్రక్కులు, ఇతర వాహనాల ద్వారా తరలించి గ్రామాన్ని ఖాళీ చేయించారు. కాగా, ఇటీవలే ఐఎస్ ఆధీనంలో ఉన్న హాజిన్ పట్టణం, ఆల్-షాఫా, సౌస గ్రామాలను తమ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి సుమారు 30 వేల మంది ఐఎస్ ఉగ్రవాదులు, సానుభూతిపరురు వారి ప్రాంతాలకు తరలిపోయారు. రెండు వేల మంది జిహాదీలు లొంగిపోయారు. భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో అమెరికా సహా, యూరోపియన్ దేశాలకు సంబంధించిన సైనిక బలగాలు కొన్నేళ్లపాటు యుద్ధాన్ని కొనసాగించాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా కనిపించిన ఐసిస్.. ఈ యుద్ధంలో శక్తి విహీనమైంది. శాంతి బలగాలు చేసిన దాడుల్లో ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఐసిస్ ఆధీనంలో ఉన్న అనేక ప్రాంతాలు, పట్టణాలను కూడా శాంతి సైనిక బలగాలు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. ఐసిస్ ఉగ్రవాదులు దాదాపు తమ శక్తి సామర్థ్యాలను, పలు ప్రాంతాలపై తమకున్న ప్రాబల్యాన్ని కోల్పోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత ఏడాది డిసెంబర్ లో అమెరికా తన సైన్యాన్ని సిరియా నుంచి వెనక్కి పిలిపించుకుంది. భారీ ఎత్తున సైన్యాన్ని మోహరింపజేయాల్సిన అవసరం లేదని భావించిన డొనాల్డ్ ట్రంప్.. తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం యూరోపియన్ దేశాలకు చెందిన సుమారు 800 మంది సైనికులు మాత్రమే సిరియాలో ఉంటున్నారు. అయితే, వారిని వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలకు సూచించారు. అటు ఐసిస్ అంతమైనట్టు ప్రకటించారు ట్రంప్. ఇస్లామిక్ ఉగ్ర‌వాదుల ఆధీనంలో ఉన్న సిరియా, ఇరాక్‌లోని ప్రాంతాలు నూరు శాతం విముక్తి పొందాయని.. కాలిఫా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే అధికారికంగా దీనిపై ప్రకటన చేసేందుకు మరికొంత సమయం పడుతుందన్న ఆయన.. త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడిస్తామన్నారు. గ‌త రెండేళ్ల‌లో అమెరికా మిత్ర‌దేశాలు ఇస్లామిక్ ఉగ్ర‌వాదుల ఆధీనంలో ఉన్న సుమారు 20వేల చ‌ద‌ర‌పు మైళ్ల నేత‌ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. పనిలో పనిగా ట్రంప్.. ఐసిస్ ఉగ్రవాదులను కూడా హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ దాడులకు తెగబడటం, ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాలను చేజిక్కించుకోవడం వంటి పనులకు దిగితే, సమీపంలో ఉన్న మిలటరీ బేస్ క్యాంపుల నుంచి దాడులు చేస్తామని హెచ్చరించారు. 2017 తరువాత ఐసిస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. సైన్యం దాడులను తట్టుకోలేకపోయింది. ఇప్పటికే తమ ఆధీనంలో ఉన్న మోసుల్, రఖా, తిక్రిత్, గౌటా వంటి ప్రాంతాలను కోల్పోయింది. ప్రస్తుతం క్యాలీఫట్ ప్రాంతంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఐసిస్ తన ఆధీనంలో ఉంచుకుంది. దీన్ని విడిపించడానికి సైనికులు అక్కడ క్రమంగా దాడులు చేస్తున్నారు. అటు సిరియా సైతం రెండు వారాల క్రితం సంచలన ప్రకటన జారీ చేసింది. ఇరాక్ లోని ఇస్లామిక్ స్టేట్, లావెంట్ ఉగ్రవాద సంస్థలపై వారంరోజుల్లో సంపూర్ణ విజయం సాధించామని సిరియన్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ చీఫ్ కమాండర్ మజ్లౌమ్ కోబానీ ప్రకటించారు. సిరియాలో ఐసిస్ ప్రాబల్యం కేవలం 700 చదరపు మీటర్లకు తగ్గిందని, దీంతో అమెరికా సేనలు తిరిగి వెళ్లాయని అన్నారు. ఉగ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో వారిని మట్టుబెట్టి అక్కడ సిరియన్ డెమోక్రాటిక్ ఫోర్స్ పాగా వేయగలిగిందని తెలిపారు. మొత్తానికి, 2014 నుంచి ఎడతెరపి లేకుండా తాము చేస్తున్న దాడుల వల్ల సిరియా నుంచి పొరుగున ఉన్న ఇరాక్, బాగ్దాది ప్రాంతాలకు జీహాదీలు పరారయ్యారు. కాగా, తీవ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోయిన సిరియాకు అమెరికా అండగా నిలిచింది. దాంతో యూఎస్ దళాలతో కలిసి ఎస్‌డిఎఫ్‌కు చెందిన ఖుర్దీష్ దళాలు ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు నిర్వహించడంతో ఆ దేశం ఇప్పుడిప్పుడే ఉగ్రవాదుల ఆధిపత్యం నుంచి బయటపడుతోంది. జూలై 2018 వరకు ఇరాక్, సిరియాలో 20 వేల నుంచి 30 వేల మందితో కొంత బలోపేతంగా కనిపించిన ఐసిస్ లో..  ప్రస్తుతం వందల సంఖ్యలో మాత్రమే ఉగ్రవాదులు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి, ఐసిస్ ఉగ్రభూతం కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇన్నాళ్లూ ముష్కర సంస్థ నీడలో మగ్గిన దాదాపు 80 లక్షల మంది ప్రజలకు విముక్తి లభించినట్టయింది.

1999 సంవత్సరం

ఇరాక్ దేశంలో ‘జమాత్ అల్ - తాహిద్ వల్ - జిహాద్’ అనే పేరుతో ఒక ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఈ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో చేతులు కలిపి ‘అల్-ఖైదా ఇన్ ఇరాన్’ అని పేరు మార్చుకుంది. అలా 2003 వరకూ కొనసాగింది. 2003లో ఇరాక్ పైన అమెరికా దాడుల క్రమంలో ఎదురుదాడులు చేసింది. ఆ తర్వాత 2006లో మరికొన్ని సున్నీ తీవ్రవాద సంస్థలతో కలిసి ‘ముజాహిదీన్ షురా కౌన్సిల్’ గా పేరు మార్చుకుంది. కొద్ది రోజుల తర్వాత ‘ఇస్లామిక్ రాజ్యం’ అంటూ పేరును ప్రకటించింది. ఆ క్రమంలో ఉగ్ర సంస్థ పేరును ‘ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్’ గా మార్చుకుంది. ఈ సంస్థకు అబుబకర్ అల్-బగ్దాదీ నాయకత్వం వహించారు. తనకు తాను ఖలీఫా ప్రకటించుకున్న అల్ బగ్దాదీ హయాంలో సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ పరిస్థితుల్లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. దాంతో అక్కడ తిష్ట వేసింది. సిరియాలో సున్నీ మెజారిటీ ఎక్కువున్న ప్రాంతాల్లో పట్టు సాధించింది. 2013లో ఏప్రిల్ నెలలో అక్కడి అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘జభాట్ అల్-సుస్రా ఫ్రంట్’ ను విలీనం చేసుకుని ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ గా పేరును మార్చేసుకుంది. 2014 ఫిబ్రవరి నెల దాకా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సన్నిహిత సంబంధం కలిగి ఉంది. కానీ, కొన్ని పొరపొచ్చాల కారణంగా, ఆధిపత్య పోరుతో అల్ ఖైదా ఐసిస్ నుంచి తెగతెంపులు చేసుకుంది. ఒక అంచనా ప్రకారం ఐసిస్ దళాల్లో భారత్ సహా దాదాపు 100 దేశాలకు చెందిన 20 వేల మంది విదేశీ ఫైటర్లు పనిచేసినట్టు సమాచారం. 200 కోట్ల డాలర్లుకు పైగా నిధులు కలిగి ఆర్థికంగా అత్యంత బలోపేతమైన ఉగ్రవాద సంస్థగా ఐసిస్ పేరుగడించింది. ఐసిస్ ఆదాయం మన కరెన్సీలో 12 వేల కోట్లతో సమానం. ఇరాక్ లో 300 లకు పైగా చమురు బావులు ఆక్రమించుకున్నాయి. అంతేకాదు, సిరియా చమురు ఉత్పత్తిలో 60 శాతం ఈ సంస్థ ఐసిస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. వేలమంది ఉగ్రపటాలంతో, ఆర్థికంగా ఎంతో బలంగా ఎదిగిన ఐసిస్.. సిరియా, ఇరాక్ లలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నెత్తుటేర్లు పారించింది. ఈ ఉగ్ర సంస్థ అధిపతి అల్ బగ్దాదీ తనకు తాను ఖలీఫాగా ప్రకటించుకుని.. ఖలీఫా భావజాలాన్ని ప్రపంచంపై రుద్దేందుకు వేలమంది అమాయకులను పొట్టనబెట్టుకున్నాడు. కుర్దిష్, యాజిదీ మహిళలపై ఐసిస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతింతై, వటుడింతై అన్న చందంగా.. ఐదారేళ్ల కాలంలోనే సిరియా, ఇరాక్ దేశాల్లో చాలా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఐసిస్.. అనధికార ప్రభుత్వాన్ని నడిపించింది. 2014లో ఇరాక్ లోని మోసుల్ పట్టణాన్ని ఆక్రమించుకోవడంతో ఐసిస్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. మోసూల్‌ లో ప్రభుత్వ కార్యకలపాలను సైతం తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. దీంతో మోసుల్ తీవ్ర హింసాత్మక దాడులకు గురింది. ఆ తర్వాత సిరియా దిశగా అత్యంత వేగంగా విస్తరించింది ఐసిస్. ఈ క్రమంలో 2015లో చారిత్రాత్మక నగరమైన పల్మిరాను దోచుకుంది. అంతేకాదు రఖా నగరాన్ని స్వయం ప్రకటిత ‘ఇస్లామిక్ కలిఫాత్’కు రాజధానిగా కూడా ప్రకటించింది. ఇరాక్ - సిరియా సరిహద్దుల్లో 30 వేల చదరపు మైళ్ల ప్రాంతాన్ని తన నియంత్రణ కిందకు తెచ్చుకుంది. ఆత్మాహుతి బాంబుదాడులకు ప్రసిద్ధిగాంచిన ఐసిస్.. తమ మతపాలనను, విధానాన్ని వ్యతిరేకించిన వారిని కిడ్నాప్ చేయడం, అత్యాచారాలు చేయడం, బానిసలుగా మార్చడం, పౌరులను ఊచకోత కోయడం వంటి ఎన్నో దురాగతాలకు పాల్పడింది. ఐసిస్ కారణంగా వేలకొద్ది చిన్నారులు అనాథలయ్యారు. దీని అనాగరికమైన, ఉగ్రదాడులతో ఎందరో స్త్రీలు వింతంతువులయ్యారు. ఈ ఉగ్రసంస్థ ఏలుబడి కాలంలో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలొదిలారు. ఐసిస్ చేసిన అతి కిరాతకమైన ఉగ్రదాడులలో ఇరాక్‌ లో యాజిదీల భారీ ఊచకోత ఒకటి. ఇది మరిచిపోలేని భయంకరమైన హింసాత్మక దాడి.  ఎప్పుడైతే ఇరాక్ దళాలు రమది, ఫల్లుజా నగరాలను తిరిగి చేజిక్కించుకున్నాయో అప్పటి నుంచి మెల్లగా ఐసిస్ ప్రభావం క్షీణించడం మొదలైంది. తర్వాత ఇరాక్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్లు, అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దళాలు, అలాగే స్థానిక కుర్దిష్ నేతృత్వంలోని పెష్మర్గా సైనికుల సహాయంతో తిరిగి మొసూల్‌ను 2017 జూలైలో తమ చేతుల్లోకి ఇరాక్ తీసుకోగలిగింది. సిరియాలోని  రఖా, పల్మిరాల పోరాటంలో ఐసిస్ ఓటమిపాలైంది. ఈ రెండు నగరాలు 2017 లో అమెరికా మద్దతు ఉన్న పెష్మర్గా చేతుల్లోకి వచ్చాయి. దీనికి తోడు ఇరాక్, అమెరికా సంకీర్ణం తోడ్పాటు కూడా వీరికి అందింది. నిజానికి, అమెరికా బాంబు దాడుల వల్లనో.. లేదా ఇరాక్ సైనిక పోరాటం వల్లనో ఐసిస్ అంతం కాలేదు. ఐసిస్ పీచమణచడం వెనుక కుర్దిష్ దళాలు కీలకపాత్ర పోషించాయి. ప్రత్యేక కుర్దిస్తాన్ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న కుర్దిష్ సేనల వల్లనే ఐసిస్ అంతమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా కుర్దిష్ నేతృత్వంలోని మహిళా విభాగం వీరోచిత పోరాటం వల్ల ఐసిస్ అంతమైంది. కుర్దిస్తాన్ లోని యాజిది అమ్మాయిలు ముష్కర మూకలను వెంటాడి మరీ మట్టుబెట్టారు. ఇలా ఓవైపు కుర్దిష్ సైన్యం, మరోవైపు సిరియన్ డెమొక్రటిక్ ఫోర్స్.. ఇంకోవైపు అమెరికా దళాల మద్దతుతో సంకీర్ణ దళాలు.. ఐసిస్ కు ముచ్చెమటలు పట్టించాయి. ఐసిస్ వ్యతిరేక సంకీర్ణంతో సిరియన్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ చేతులు కలిపి ముందుండి సిరియాలో ఉగ్రభూతాన్ని కుప్పకూల్చే సాహసాన్ని చేసింది. ఆ దేశానికి కుర్దిష్‌లతో ఉన్న సంబంధాల కారణంతో టర్కీ లాంటి వాటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా కూడా అమెరికా తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఐసిస్ ను సిరియాలోని రఖా, ఇతర టౌన్లలో ఓటమిపాలు చేయడంలో కుర్దులు సహాయపడ్డారు. అమెరికా సారథ్యంలోని సంకీర్ణ దళాలు, రష్యా దళాలు కాకుండా ఐఎస్ వ్యతిరేక యుద్ధంలో నిజమైన గేమ్-ఛేంజర్స్ ఎస్‌డిఎఫ్ దళాలే అని చెప్పాలి. ఎట్టకేలకు ఐసిస్ ప్రస్థానం ఇక చివరి మజిలీకి చేరుకుంది. ప్రస్తుతం బాగౌజ్ అనే చిన్న గ్రామంలో మాత్రమే ముష్కర మూకలు దాగున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ గ్రామాన్ని స్వాధీనం చేసుకునేందుకు సంకీర్ణ దళాలు పోరాటం చేస్తున్నాయి. వారాల తరబడి కొనసాగిన బాంబు దాడులు, వైమానిక దాడుల కారణంగా ఐసిస్ ముష్కరులు పారిపోతున్నాయి. ఇక వారికి వేరే ఆప్షన్ లేదు. లొంగిపోవడం లేదా ప్రాణాలు వదిలేయడం తప్ప వారికి మరో మార్గం లేదు.

ప్రపంచాన్ని దాదాపు ఐదేళ్ల పాటు కలవరపెట్టిన ఐసిస్..

బాగౌజ్ గ్రామం నుంచి ముష్కరులను తరిమేస్తే ఐసిస్ ఇక అంతమైనట్టే. ఇప్పటికే వేలాదిమంది సాధారణ పౌరులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ఉగ్రవాదులతో పాటు ఇంకా కొందరు పౌరులు మిగిలి ఉన్నారు. ఐసిస్ పోరాటంలో పాల్గొనడానికి వచ్చి ఉగ్రవాదులను వివాహమాడిన మహిళలు, వారి పిల్లలు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. బాగౌజ్ ను వశం చేసుకుంటే, ఇక ఉగ్రవాదులు చెప్పుకుంటున్న ఇస్లామిక్ ఖాలీఫేట్ పూర్తిగా అంతమైనట్టే. అయితే ఇస్లామిక్ స్టేట్ అంతరించినంత మాత్రాన సమస్యలు తీరలేదు. ఐసిస్ ఉగ్రవా దం అవతరించడానికి దారితీసిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. దీంతో ఐసిస్ ఉగ్రవాదులు లొంగిపోయిన నేపథ్యంలో కొన్ని కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సి వుంది. ఐసిస్ అవతరించడం, ప్రపంచదేశాలు దానిపై యుద్ధానికి దిగడం మొదలైన తర్వాత అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. వేలాది మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఇప్పుడు తుదిదశ పోరులో అనేకమంది మహిళలు బయటికి వస్తున్నారు.  ఐసిస్ పతనం ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేదిగా ఉండకూడదనేది నిపుణులు చెబుతున్న మాట. లొంగిపోయిన వారంతా 40కి పైగా దేశాలనుంచి వచ్చినవారే. బందీలుగా ఉన్నప్పటికీ వీరంతా కరడుగట్టిన భావజాలంతోనే ఉన్నారు. వీరిని ఆయా దేశాలు స్వీకరించడానికి సిద్ధంగా లేవు. యూరప్ దేశాలు కూడా వీరిని స్వీకరించడానికి నిరాకరిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో వీరిపై విచారణ జరిపి శిక్షించడం అంత సులభం కాదు. మహిళలు పిల్లల విషయం కూడా సమస్యగానే ఉంది. ఆ తల్లుల పెంపకంలో పిల్లలు కూడా కరడుగట్టిన మతవాద భావజాలం వైపు అడుగులు వేయవచ్చు. దీర్ఘకాలికంగా వీరిని భరించేదెవరనే చర్చ ఇప్పటికే మొదలైంది. ఇక ఇస్లామిక్ స్టేట్ పతనమైనా, ఉగ్రవాద ప్రభావం మాత్రం తగ్గలేదు. ఐసిస్ అనేది స్వాభావికంగా ఉగ్రవాద సంస్థ. మొదటిదశలో నిద్రాణ బృందాలను ఏర్పాటుచేసుకొని అనేక విధ్వంసాలకు, మారణ హోమాలకు పాల్పడింది. ఇరాక్, సిరి యా దేశాలలో విస్తరించి ఖాలిఫేట్ ప్రకటించుకుంది. వసూళ్లకు పాల్పడుతూ పోటీ ప్రభుత్వాన్ని నడిపి ప్రపంచాన్ని సవాల్ చేసింది. మళ్లీ ఇరాక్‌లో భూభాగం కోల్పోగానే ఆయా ప్రాంతంలో ఉగ్రవాద బృందాలకు స్వేచ్ఛా కార్యకలాపాలు సాగించుకోమని కూడా ఆదేశాలిచ్చింది. ఇప్పుడు ఆయా ముఠాలు అపహరణలకు, విధ్వంసాలకు పాల్పడుతున్నాయి. ఇప్పుడు సిరియాలో కూడా అదే పరిస్థితి ఏర్పడవచ్చు. వేలాదిమంది ఉగ్రవాదులు పట్టుబడటం, మరణించడం నిజమే అయినా.. ఇంకా అనేకమంది ఉగ్రవాదుల జాడ తెలియడం లేదని మాత్రం వాస్తవం. వీరంతా ఇతర దేశాల్లో చెల్లాచెదురుగా కూడా ఉండవచ్చు. ఆఫ్ఘనిస్థాన్, యెమెన్, నైజీరియా మొదలైన దేశాలలో వీరి ఉనికి స్పష్టంగా కనబడుతోంది. ఎక్కడ రాజకీయ అనిశ్చితి ఉంటే దానిని ఉపయోగించుకోవడానికి ఉగ్రవాదులు ఎత్తుగడలు వేస్తున్నారు. ఐసిస్ నాయకుడు అబు బకర్ అల్-బగ్దాది మరణంపై ఇప్పటికీ అనుమానాలు వీడలేదు. ఐసిస్ పతనం ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేదిగా ఉండకూడదనేది నిపుణులు చెబుతున్న మాట. ఐసిస్ ను అంతమొందించడంలో చూపిన ఆసక్తి, ఉగ్రవాదాన్ని మొత్తంగా అంతం చేయడంలో చూపినప్పుడు మాత్రమే.. ఉగ్రభూతం పూర్తిగా అంతమవుతుంది.