Saturday, August 24, 2019
Follow Us on :

చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అన్న మాటలు అసెంబ్లీలో ప్లే చేస్తానన్న జగన్

By BhaaratToday | Published On Jun 13th, 2019

23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం గతంలో నిబంధనలకు తూట్లు పొడిచిందని.. కానీ తాను అలాంటి పనులు చేయబోనని అన్నారు జగన్..! తాను సైగ చేస్తే పార్టీ మారడానికి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని.. కానీ తాను అలా చేయనని జగన్ అన్నారు. పార్టీ మారాలి అనుకుంటే తాను ఖచ్చితంగా రాజీనామా చేయిస్తానని జగన్ అన్నారు. కానీ చంద్రబాబు అలా చేయలేదని.. అనర్హత వేటు వేయకుండానే 23 మందిలో కొందరికి ఏకంగా మంత్రి పదవులు ఇచ్చారని జగన్ అన్నారు. 

జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందించారు. జగన్ తండ్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ మారిన సంగతిని గుర్తు చేశారు. ఎవరెవరు తెలుగుదేశం పార్టీని మారడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పాలని జగన్ ను ప్రశ్నించారు చంద్రబాబు. 

అయితే చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని. ఎవరో హత్య చేసింటే.. తాను కూడా హత్య చేశానని ఓ కరుడుగట్టిన నిందితుడు చెప్పినట్లు ఉందని జగన్ చెప్పుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గురించి ఎన్టీఆర్ అన్న మాటలు అసెంబ్లీలో టీవీల్లో ప్లే చేస్తానని జగన్ అన్నారు. దీంతో మాటలు ఎక్కడికో పోతున్నాయని భావించిన స్పీకర్ వారిని వారించారు.