Thursday, December 12, 2019
Follow Us on :

మహేష్ బాబు సినిమా వివాదం: 33 ఏళ్ల నా కెరీర్ లో ఇలా జరగడం తొలిసారన్న జగపతి బాబు

By BhaaratToday | Published On Jul 19th, 2019

మహర్షి సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా..! ఈ సినిమా నుండి జగపతి బాబు వైదొలిగారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై జగపతిబాబు క్లారిటీ ఇచ్చారు. 

చిత్ర పరిశ్రమ తన ఫ్యామిలీ లాంటిదని, అలాంటి చిత్ర పరిశ్రమ గురించి బహిరంగంగా మాట్లాడడం తనకిష్టంలేదని జగపతి బాబు అన్నారు. కానీ ఒక క్లారిఫికేషన్ అయితే తప్పలేదు. 33 ఏళ్ల నా కెరీర్ లో ఇలా ఎప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం రాలేదు. మహేశ్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం నుంచి నేను తప్పుకున్నానంటూ రకరకాల పుకార్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో..! వాటిలో ఎలాంటి వాస్తవంలేదు. వాటిని ఎవరూ నమ్మవద్దు. ఇప్పటికీ ఆ సినిమాలో క్యారక్టర్ అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికీ చేయమంటే ఆ క్యారక్టర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆ సినిమా కోసం రెండు సినిమాలు వదులుకున్నానన్నది  నిజం.  చిత్ర పరిశ్రమలో కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో ఇదీ కూడా ఒకటి. ఆ పరిస్థితుల కారణంగానే నేను ఆ సినిమాలో లేను. నేనా సినిమాను ఎంతో మిస్సవుతున్నాను. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అని జగపతిబాబు ఒక వీడియోను విడుదల చేశారు. 

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి జగపతిబాబు అవమానకర రీతిలో బయటికొచ్చేశాడంటూ గత కొన్నిరోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దానికి క్లారిటీ ఇచ్చారు జగపతిబాబు.