Monday, November 18, 2019
Follow Us on :

ఉగ్ర‌వాదుల‌పై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు భద్రతా బలగాలు సిద్ధం

By BhaaratToday | Published On Feb 17th, 2019

పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడితో భార‌త్ ముందుడుగులు వేస్తోంది. పాక్ ప‌ని ప‌ట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూరుస్తూ, వారికి అశ్రయమిస్తున్న పాక్‌కు తగిన గుణపాఠం చెబుతామని గట్టి హెచ్చరికలు చేసిన భారత్... పాక్‌ను అష్టదిగ్బంధనం చేసేందుకు అవసరమైన అన్ని మార్గాలను చురుకుగా పరిశీలిస్తోంది. ఇండియా తమ వాయుదళ సామర్థ్యాన్ని, లక్ష్య ఛేదన సామర్థ్యాన్ని చాటుకునేందుకు సన్నద్ధంగా ఉందని అత్యున్నత భద్రతా వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దుల వెంబడి వాయిదాడులు జరిపే అవకాశాలున్నట్టు ఢిల్లీలోని ఉన్నతాధికారుల ద్వారా స‌మాచారం. ఇందుకోసం సరిహద్దుల సమీపంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 140 విమానాల సముదాయం చేరుకుని ప్రదర్శనలు సాగిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం.
 
ఏ క్షణలో అదేశాలు అందినా అతి తక్కువ సమయంలోనే ఐఏఎఫ్ విమానాలు దాడులకు దిగగలుగుతాయని వాయిసేన ఉన్నతాధికారులు తెలిపారు. తమకు అప్పగించిన ఎలాంటి ఆపరేషన్ అయినా వెంటనే అమలు చేసేందుకు ఐఏఎఫ్ ఎప్పుడూ సిద్ధమేనని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా చెప్పారు. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత వేగంగా, కచ్చితత్వంతో, రాత్రిపగలు తేడా లేకుండా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ చేపట్టగలమని అన్నారు.

పుల్వామా దాడికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రతి కన్నీటి బొట్టుకూ బదులు తీర్చుకుంటామని, ఏమూల ఉగ్రవాదులు దాక్కున్నా, వారికి అండగా నిలుస్తున్న ముష్కరులు ఎక్కడున్నా మట్టుబెట్టితీరుతామని ప్రధాని మోదీ శనివారం హెచ్చరించిన నేపథ్యంలో సరిహద్దుల వద్ద భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.