Saturday, October 19, 2019
Follow Us on :

కశ్మీర్ లో టెన్షన్ వాతావరణం…భారీగా కేంద్ర బలగాల మోహరింపు

By BhaaratToday | Published On Aug 5th, 2019

జమ్మూకశ్మీర్‌లో టెన్షన్ వాతవరణం నెలకొంది. ఆదివారం నాటికి మరింత వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. ఈ సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఎలాంటి బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతి లేదు. ఉగ్రవాదులు దాడిచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో శ్రీనగర్‌ను వీడాలని రాష్ట్ర క్రికెట్‌ జట్టు కోచ్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను అధికారులు ఆదేశించారు. అదే సమయంలో జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్‌ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా ఇంట్లో సమావేశమైన అఖిలపక్ష నేతలు పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్‌లకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్యవర్తిత్వం చేసేందుకు ఇదే సరైన సమయమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్‌ కశ్మీర్‌పై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

జమ్మూలోనూ బలగాల మోహరింపు..
జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు భారీగా మోహరించాయి. ఉగ్రముప్పు నేపథ్యంలో కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్‌ ప్రధాన కార్యాలయం, విమానాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఆదివారం కట్టుదిట్టం చేశారు. అలాగే జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్‌ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలను భారీగా మోహరించారు.

పరిస్థితులపై అమిత్‌ షా–దోవల్‌ భేటీ..
జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5–7 మంది పాక్‌ బ్యాట్‌ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చించారు. మరోవైపు జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్‌నాథ్‌ యాత్రికులు రిజర్వేషన్‌ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయరాదని కార్గిల్‌ కలెక్టర్‌ ఆదేశించారు.