Monday, November 18, 2019
Follow Us on :

'జెర్సీ' మూవీ రివ్యూ

By BhaaratToday | Published On Apr 20th, 2019

- బ్యాన‌ర్‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
- న‌టీన‌టులు: నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్, స‌త్యరాజ్‌, రోనిత్ క‌మ్ర‌, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ, శిశిర్ శ‌ర్మ‌, సంప‌త్‌, ప్ర‌వీణ్ త‌దిత‌రులు
- సంగీతం: అనిరుద్ ర‌విచంద్ర‌న్‌
- కెమెరా: సాను జాన్‌వ‌ర్గీస్‌
- నిర్మాత‌: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
- క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: గౌత‌మ్ తిన్న‌నూరి

 
ప్ర‌స్తుతం ఉన్న యువ క‌థానాయ‌కుల్లో నానిది ప్ర‌త్యేక శైలి. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ, ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో 8 వ‌రుస విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించిన హీరోగా కూడా నాని పేరు సంపాదించుకున్నాడు. అయితే నాని గ‌త చిత్రాలు కృష్ణార్జున యుద్ధం, దేవ‌దాస్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన మేర స‌క్సెస్ సాధించ‌లేదు. అయినా కూడా నాని పంథాను మార్చుకోకుండా వైవిధ్య‌మైన క‌థాంశంతో చేసిన చిత్ర‌మే `జెర్సీ`. 36 ఏళ్ల వ్య‌క్తి మ‌ళ్లీ క్రికెట‌ర్ కావాల‌నుకున్న‌ప్పుడు అత‌ను ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేశాడు. చివ‌ర‌కి అత‌ని అనుకున్న‌ల‌క్ష్యాన్ని చేరుకున్నాడా? అనే క‌థాంశంతో ఈ సినిమా రూపొందింది. నాని ఈ చిత్రంలో తండ్రి పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. మ‌రి `జెర్సీ`తో నాని ఎలాంటి విజ‌యాన్ని ద‌క్కించుకున్నాడు? అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం...
 
కథ
అర్జున్‌ (నాని) ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో ఆడాలని​ కలలు కంటూ ఉంటాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా చివరి క్షణాల్లో అవకాశం వచ్చి.. చేజారి పోతూ ఉంటుంది. అలా 26 ఏళ్ల వయసులో కెరీర్‌(క్రికెట్‌ లైఫ్‌) ను వదిలేస్తాడు. అప్పటికే తను ప్రేమించిన సారాను పెళ్లి చేసుకున్న అర్జున్‌..  ఓ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి సాధార‌ణ జీవితం గ‌డుపుతుంటాడు. అర్జున్‌, సారాలకు నాని అనే కుమారుడు పుడతాడు. కొంత కాలానికి అర్జున్ ఉద్యోగం పోతుంది. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఉంటాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ.. కనీసం కొడుకు పుట్టిన రోజున అడిగిన బహుమతి కూడా కొనివ్వలేని ప‌రిస్థితిలో ఉంటాడు. ఇలా అన్నింటిని భరిస్తూ ఉన్న అర్జున్‌.. కొడుక్కి తనో హీరోలా కనబడడానికి ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మొద‌లు పెట్టాల‌నుకుంటాడు. అసలు అర్జున్‌  క్రికెట్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది.. చివరకు అర్జున్‌ ఏమయ్యాడు? తాను అనుకున్నట్లు కొడుకు దృష్టిలో హీరోగా మిగిలిపోయాడా? లేదా అన్నదే జెర్సీ స్టోరీ.

నటీనటులు
అర్జున్‌ పాత్రలో నానిని తప్పా మరొకరిని ఊహించుకోడానికి అవకాశం లేకుండా.. ఆ పాత్రలో జీవించేశాడు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గానూ, సాధార‌ణ కుటుంబంలో ఒక‌డిగా నటించి మెప్పించాడు. నిజ‌జీవితంలో నాన్నగా  మారినా నాని.. రీల్‌ లైఫ్‌లోనూ ఆ ఫీలింగ్‌ను క్యారీ చేశాడు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ.. తనే ప్రపంచంలా బతికే తండ్రి పాత్రలో జీవించాడు. ఇక సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ మంచి మార్కులు కొట్టేసింది. ప్రేయసిగానూ, భార్యగానూ రెండు పాత్రల్లో శ్రద్దా సహజంగా నటించింది. లుక్స్‌పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక కోచ్‌గా, స్నేహితుడిగా నిత్యం అర్జున్‌ పక్కనే ఉండి నడిపించే సత్య రాజ్‌.. తన పాత్రకు న్యాయం చేశాడు. నాని స్నేహితులుగా నటించిన వారు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. 

విశ్లేషణ
మనిషి కష్టాలు పడుతూ.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. చివరికి సక్సెస్‌ అవ్వడం.. ఈ కాన్సెప్ట్‌ వెండితెరకు మామూలే. అయితే స్క్రీన్‌పై ఆ కథలనే ఏవిధంగా ఆవిష్కరించామన్న దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. జెర్సీ లాంటి కథలు మనం ఈపాటికే ఎన్నింటినో చూసి ఉంటాము. కానీ ఈ కథకు క్రికెట్‌ నేపథ్యం ఎంచుకోవడం, ఆ పాత్రలో నాని విశ్వరూపం చూపించడం, గౌతమ్‌ తిన్ననూరి తన టాలెంట్‌తో కథను నడిపించిన తీరే ఈ సినిమాను నిలబెట్టాయి. డెబ్బై రోజుల నాని కష్టం.. తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా నాని తనను తాను మలచుకోవడంలో సక్సెస్‌ అయ్యాడు. గౌతమ్‌ తిన్ననూరి తనకు కలిసి వచ్చిన స్క్రీన్‌ ప్లేతో మరోసారి మ్యాజిక్‌ చేశాడు. కథలో భాగంగానే అక్కడక్కడా ఫ్లాష్‌ బ్యాక్‌ను రివీల్‌ చేస్తూ.. సినిమాను ముందుకు కొన‌సాగించాడు. అయితే ఈ క్రమంలో ఫస్టాఫ్‌ కాస్త సాగ‌దీసిన‌ట్లు, స్లో గానూ నడిచినట్టు అనిపిస్తుంది. ఇక నాని తన కుమారుడితో ఉన్న సన్నివేశాలు కంటతడిపెట్టిస్తాయి. సెకండాఫ్‌లో వేగం పెంచినా.. పూర్తిగా క్రికెట్‌ నేపథ్యంలో సాగింది. అయితే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.

ప్ల‌స్ పాయింట్లు
- న‌టీన‌టులు న‌ట‌న‌
- నేప‌థ్య సంగీతం
- బ‌ల‌మైన ఎమోష‌న్స్
- అక్క‌డ‌క్క‌డా డైలాగులు
 
మైన‌స్ పాయింట్లు
- కాస్త బోర్‌గా సాగే ఫ‌స్టాఫ్‌
- అక్కడ‌క్క‌డా సాగ‌దీత‌గా అనిపించడం