Monday, September 23, 2019
Follow Us on :

తిరుమల టికెట్ పై జెరూసలేం యాత్ర అంటూ ప్రచారం.. చర్యలు మొదలయ్యాయి..!

By BhaaratToday | Published On Aug 26th, 2019

తిరుమలలో అన్యమత ప్రచారాన్ని ఆపాలని ఏనాటి నుండో హిందువులు పోరాడుతూ ఉన్నారు. అయిననూ అధికారుల కళ్లుగప్పి ఎన్నోసార్లు అన్యమత ప్రచారం జరుగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం తిరుమల భక్తులకు ఇచ్చే ఆర్టీసీ బస్ టికెట్ల వెనుక జరూసలేం యాత్రకు తక్కువ ఖర్చుతో తీసుకెళతామని ఓ ప్రకటన కనిపించింది. తక్కువ ఖర్చు, అన్ని సౌకర్యాలతో క్రైస్తవులకు పవిత్ర జరుసలేం యాత్ర అంటూ ఓ ప్రకటన ముద్రితమై ఉండటం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ టికెట్లను పొందిన భక్తులు, ఆర్టీసీ అధికారులను నిలదీశారు. ఈ ఘటనను భారత్ టుడే తీవ్రంగా వ్యతిరేకించింది. 

ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఓ అధికారిపై వేటు వేసింది. నెల్లూరు జోన్‌ లో స్టోర్స్‌ కంట్రోలర్‌ గా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ బాబుపై సస్పెన్షన్‌ వేటు విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. టికెట్ల రోల్స్‌ ను పంపిణీ చేయడంలో జగదీశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలినందునే ఈ చర్యలు తీసుకున్నామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు వెల్లడించారు. జగదీశ్ అనాలోచిత నిర్ణయం కారణంగా వేలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వ ప్రతిష్టకు సైతం భంగం వాటిల్లిందని అన్నారు.