Monday, November 18, 2019
Follow Us on :

పాక్ ఊహించని షాక్ ఇచ్చి భారత్ కు రానున్న చైనా అధ్యక్షుడు..!

By BhaaratToday | Published On Oct 11th, 2019

కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్-చైనా దేశాలు కొద్దిరోజుల క్రితం భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి తెలిసిందే..! పాకిస్థాన్ కు చైనా ఒక్కటే మద్దతు ఇచ్చింది. అయితే భారత్ పర్యటనకు రానున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పాకిస్థాన్ కు షాక్ ఇచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు.  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బీజింగ్ లో జిన్ పింగ్ తో చర్చలు జరపగా కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ అంశంలో పాకిస్థాన్ కు అనుకూలంగా జిన్ పింగ్ మాట్లాడుతాడని అనుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. అయితే జిన్ పింగ్ మాత్రం కాశ్మీర్ వ్యవహారాన్ని భారత్, పాక్ లు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిందే తప్ప, మరో దేశం కల్పించుకునే పరిస్థితి లేదని చెప్పేయడంతో ఇమ్రాన్ ఖాన్ షాక్ తిన్నాడు. 

శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ కు రానున్నారు. దీంతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును చైనా భద్రతా సిబ్బంది ఆధీనంలోకి తీసుకుంది. చైనా దళాలు, చెన్నై విమానాశ్రయాన్ని అడుగడుగునా గాలించాయి. జిన్ పింగ్ ల్యాండ్ అయిన తరువాత, ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. చైనా భద్రతాధికారులకు సీఆర్పీఎఫ్ దళాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి. జిన్ పింగ్ కోసం ప్రత్యేక కాన్వాయ్ ఇప్పటికే చెన్నై చేరుకుంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, బాంబు దాడులను తట్టుకునే సామర్థ్యంతో కూడిన నాలుగు ప్రత్యేక వాహనాలు వచ్చాయి. 

ఎయిర్ పోర్టు నుంచి గిండి ప్రాంతంలోని స్టార్ హోటల్ కు వెళ్లే ఆయన, తిరిగి తన కాన్వాయ్ లోనే మహాబలిపురం చేరుకుంటారు. మహాబలిపురానికి చైనా సంస్కృతికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే జిన్ పింగ్ ఇక్కడే భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని భావించారు.

మూడో పల్లవరాజు కుమార విష్ణువు అదేనండి బోధి ధర్ముడు ఎన్నో యుద్ధ విద్యల్లో, వైద్య కళల్లో నిష్ణాతుడు. ఆయన బౌద్ధమతం స్వీకరించి, ఆయన చైనాకు వెళ్లిపోయి అక్కడే ఉండిపోతాడు. చైనాలో బోధి ధర్ముడు ఎంతో ఆరాధ్యుడు. ఈ చరిత్ర మొత్తం సూర్య 'సెవెన్త్ సెన్స్' సినిమాలో చూపించారు. బోధిధర్ముడు  నడయాడిన ప్రాంతం కావడంతో జిన్ పింగ్ మహాబలిపురాన్ని ఎంచుకున్నారు.