Monday, November 18, 2019
Follow Us on :

ఆడపిల్లలు పుట్టారని వదిలించుకునేందుకు ప్లాన్.. ఇంతకీ ఆ ప్రభుద్ధుడు ఏం చేశాడు?

By BhaaratToday | Published On Oct 19th, 2019

వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి! అమ్మయి..అబ్బాయి ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులే కావడంతో అమ్మాయి తల్లి...ఆమె అన్నయ్య కూడా ఎంతగానో సంతోషించారు. అడిగినంత కట్నం ఇచ్చారు. సకల మర్యాదలు చేశారు. వైభవంగా పెళ్లి చేశారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో ఇద్దరూ అక్కడికి వెళ్లారు! కొంతకాలం బాగానే ఉన్నారు! ఇద్దరు అమ్మాయిలు కూడా పుట్టారు! చిన్న అమ్మాయికి మానసిక అంగవైకల్యం! ఆమెకు చికిత్స అవసరం! అయితే కథ అడ్డం తిరిగింది! ఆడపిల్లలు పుట్టారని ఆమెను వదిలించుకునేందుకు ప్లాన్ వేశాడు. ఇంతకీ ఆ ప్రభుద్ధుడు ఏం చేశాడు? 

అసలు ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన..? వారసుడు లేకపోతే కిరీటం పడిపోతుందా..? మొగపిల్లాడు పుట్టకపోతే ఈ సమాజం వెలివేస్తుందా..? సృష్టికి మూలమైన ఆడపిల్లపై ఎందుకు అంత వివక్ష...? ఆడపిల్ల పుట్టిందని తెలిసి పురుట్లోనే చంపుతున్నారు కొందరు దుర్మార్గులు! ఆడపిల్ల పుట్టగానే కర్కశంగా కడతేర్చుతున్నారు మరికొందరు రాక్షసులు! ఇలా స్త్రీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.! ఆడవాళ్లు లేనిది మనిషి మనుగడలేదని తెలిసి కూడా వెర్రితనంతో నీచంగా ప్రవర్తిస్తున్నారు. 

ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగింది! హైదరాబాద్ నింబోలిఅడ్డాకు చెందిన దివంగత నేత ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుడు కోత్ మీర్ ప్రేమ్ రాజ్ యాదవ్ మనువరాలు కవితను...సికింద్రాబాద్ కు చెందిన పొన్నబోయిన యాదగిరి చిన్న కుమారుడు శ్రీను కుమార్ యాదవ్ కు ఇచ్చి వివాహం చేశారు. కవిత తండ్రి ఆది క్రిష్ణ యాదవ్ చిన్నతనంలోనే మరణించాడు. ఆమె...తల్లి తన ముగ్గురు పిల్లలను కష్టపడి చదివించారు. ఉన్నత విద్యావంతులను చేశారు. శ్రీను కుమార్ తో తన కుమార్తె జీవితం బాగుటుందని తలిచారు. అడిగినంత కట్నం ఇచ్చారు. సకల మర్యాదలు చేశారు. ఏ మాత్రం తేడా రాకుండా వైభవంతో వివాహం జరిపించారు. 2004 మార్చి 14న సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్స్ లో ఎంతో వైభవంగా వివాహం జరిపించారు.   

కొంతకాలం తర్వాత కవిత-శ్రీను కుమార్ కలిసి...ఇద్దరు కూడా ఆస్ట్రేలియా వెళ్లారు. వీరిద్దరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు కూడా పుట్టారు. అయితే ఇటు తమకు వారసుడు కావాలని..., ఇండియాలో ఉంటున్న అబ్బాయి కుటుంబం నుంచి వత్తిడి పెరిగింది.! దీనికి తోడు రెండో అమ్మాయి...మానసిక వైకల్యం ఉండటంతో ఎలాగైనా  కవితను వదిలించుకునేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అంతకాలం ఆమెను తీవ్ర హింసలకు గురిచేసిన శ్రీనుకుమార్...పథకం ప్రకారం మాయామాటలతో నమ్మించి ఇండియాకు తీసుకువచ్చాడు! ఇండియాకు తీసుకువచ్చిన వెంటనే...శ్రీనుకుమార్ కుటుంబ సభ్యులు అందరూ ఆమెకు నరకం చూపించారు. మాకు మగపిల్లాడు కావాలి! ఇక నీవు వద్దు...మా వాడికి విడాకులు ఇచ్చేయ్ అంటూ ఒక గదిలో పెట్టి టార్చర్ పెట్టారు.రెండు నెలలపాటు ఒక గదిలో బంధించారు. ఎలాగో అలాగే తనను చిత్రహింసలకు గురిచేస్తున్న విషయాన్ని నింబోలిఅడ్డాలో ఉంటున్న తన కుటుంబ సభ్యులకు తెలిపింది. కుటుంబ సభ్యులు చిత్రహింసలపై ఫోన్ లోనే నిలదీశారు. కవితను తమ ఇంటికి తీసుకువచ్చారు! 

కవిత తన పుట్టింటిలోనే ఆరునెలుల ఉంది! తన పిల్లల చదువులు సైతం దెబ్బతినడంతో ఆందోళనపడింది. దీనిపై 2016లో బేగంపెట పోలీస్ స్టేషనల్ లో ఫిర్యాదు కూడా చేసింది.కవిత ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. శ్రీను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద ఉన్న కవిత, పిల్లల పాస్ పోర్టులు స్వాధీనం చేసుకొని వారికి అందజేశారు. అయితే ఆ తర్వాత కవిత తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని...తన చిన్న కుమార్తె చికిత్స కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. అక్కడే ఉన్న కవిత అన్న తనకు ఆశ్రయం కల్పించాడు. ఓ ఉద్యోగం చూపించి.. వారికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇక హైదరాబాద్ శ్రీను ఈ లోపు చేయాల్సిన తతంగం అంతా కానిచ్చాడు. సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు సైతం పెండింగ్ లో ఉండగానే...  భార్య అలా ఆస్ట్రేలియా వెళ్లిందో లేదో తన రెండో పెళ్లి సంబంధాల కోసం వెతుకాలాట మొదలు పెట్టాడు. ఇక్కడ విడాకులు రాకముందే...ఆస్ట్రేలియా కోర్టు విడాకులు ఇచ్చిందంటూ...అందర్ని మభ్యపెట్టి మోసం చేశాడు. నిజానికి సుప్రీం కోర్టు 1991లో ఇచ్చిన గైడ్  లైన్స్ ప్రకారం విదేశీ కోర్టులు ఇచ్చిన విడాకులు మన దేశంలో చెల్లెవు! ఇదే విషయాన్ని సికింద్రాబాద్ లోని ఫ్యామిలో కోర్టు కూడా ధృవీకరించింది! 

అటు కోర్టులను...ఇటు పోలీసులను మోసం చేసిన శ్రీనుకుమార్, తన భార్యకు కవితకు విడాకులు ఇవ్వకుండానే...రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వేరు కాపురం కూడా పెట్టాడు! ఈ విషయాలు ఏమీ తెలియని కవిత.. పిల్లలను పోషించుకుంటూ తన అన్న నీడలో బతుకుతోంది. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి తన పిల్లల భవిష్యత్తు ఏంటని కన్నీటి పర్యంతం అవుతోంది. ఆడపిల్లలను కనడమే నేను చేసిన తప్పా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.

శ్రీను, కవితలకు పుట్టిన ఇద్దరు అమ్మాయిల్లో చిన్న అమ్మాయి మానసిక పరిస్థితి బాగోలేదు. తనకు మెరుగైన వైద్యం చేయించడం కోసమే కవిత మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లింది. ఇప్పుడు భర్త... రెండో పెళ్లి చేసుకోవడంతో తన ఇద్దరి ఆడపిల్లలకు దిక్కెవరంటూ కవిత ప్రశ్నిస్తోంది. దీనిపై భారత అధికారులు స్పందించి.. విడాకులు రాకుండానే రెండో పెళ్లి చేసుకున్న తన భర్త శ్రీనును అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

కవితకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే సాకుతోనే విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు శ్రీను! ఆ విడుకుల కూడా రాకుండానే రెండో పెళ్లి చేస్కోని వారిని కవిత, పిల్లలను అనాధల్ని చేశాడు!  అయితే ఇప్పుడు చేసుకున్న మహిళకు కూడా అమ్మాయిలే ఏం చేస్తారంటూ కవిత నిలదీస్తోంది!  అప్పుడు ఇంకో పెళ్లి చేస్కుంటారా అంటూ ప్రశ్నిస్తోంది.! ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది! తనకు ఆస్ట్రేలియాలో న్యాయం జరగకపోయినా భారత్ లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెబుతోంది కవిత. 

పెళ్లీడుకు వచ్చిన శ్రీను పెద్ద కూతురు కూడా తండ్రి చేసిన పనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన తండ్రి తమను ఎంతలా ఇబ్బంది పెట్టాడో చెప్పుకొచ్చింది. కేవలం తాము ఆడపిల్లలుగా పుట్టడమే పాపమా అంటూ సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తోంది. ఇప్పుడు తమకు ఎలాంటి ఆధారం లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన తల్లికి, తమకు న్యాయం చేయాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. 

కేవలం ఆడపిల్లలు పుట్టారని భార్య, పిల్లలను వదిలిపెట్టి శ్రీను రెండో పెళ్లి చేస్కోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కవితకు, తన పిల్లలకు న్యాయం చేసేందుకు ఇక్కడి పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమ బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని కవిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. శ్రీనుకుమార్ యాదవ్ ను అరెస్ట్ చేసి అతని ఆస్తులను ఆడపిల్లల పేరును రాయాలంటున్నారు. అప్పుడే వాళ్లకు న్యాయం చేసిన వాళ్లు అవుతారని చెబుతున్నారు.

అయితే ఉన్నత చదువులు చదువున్న శ్రీనుకుమార్ లాంటి వ్యక్తులు కూడా ఆడపిల్లలు పుట్టడానికి భార్యనే కారణమని భావించడమే వివేకమే అవుతుంది. ఎందుకంటే ఆడబిడ్డా, మగబిడ్డా అని నిర్ణయించేది పురుషుడే కానీ స్త్రీ కాదు. పురుషునిలో ఎక్స్‌ వై క్రోమోజోమ్స్‌ ఉంటాయి. స్త్రీలో కేవలం ఎక్స్‌ ఎక్స్‌ క్రోమోజోమ్స్‌ ఉంటాయి. పురుషుని వై క్రోమోజోమ్‌ స్త్రీతో కలిస్తే మగబిడ్డ, పురుషునిలోని ఎక్స్‌ క్రోమోజోమ్‌ స్త్రీతో కలిస్తే ఎక్స్‌ ఎక్స్‌ అయి ఆడబిడ్డ జన్మిస్తారనేది సైన్సు చెప్పే యదార్థం.!