Monday, November 18, 2019
Follow Us on :

మధ్యవర్తిత్వానికి సిద్ధమైన కె.కేశవరావు.. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తారా..?

By BhaaratToday | Published On Oct 15th, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉగ్రరూపం దాలుస్తున్న సమయంలో టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు సోమవారం ఉదయం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఉంచిన డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అన్న డిమాండ్ మినహా.. మిగతావన్నీ పరిష్కరించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని అన్నారు కేశవరావు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ ఎన్నడూ హామీ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు కేశవరావు. కార్మికులు వెంటనే సమ్మెకు స్వస్తి చెప్పాలని.. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలు చేయవద్దని సూచించారు. సమస్యకు ఆత్మహత్యలు, బలిదానాలు పరిష్కారం కాదన్నారు. సమ్మె విరమిస్తే, చర్చలకు ప్రభుత్వం.. విలీనం తప్ప మిగతా డిమాండ్లపై స్పష్టమైన హామీలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. అలాగే  ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. 

తాజాగా ఆయన మరోసారి మాట్లాడుతూ ఆర్టీసీ జేఏసీ నేతలతో సంప్రదింపుల విషయంలో తనను సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు పిలవలేదని స్పష్టతనిచ్చారు. ఆర్టీసీ సమ్మెతో పరిస్థితులు చేయి దాటిపోతుండడంతోనే తాను ఆ విధంగా వ్యాఖ్యానించానని.. తనను ఆర్టీసీ జేఏసీ నేతలు ఎవరూ కలవలేదని చెప్పారు. ఒకవేళ కేసీఆర్ నుంచి ఆదేశాలు వస్తే తాను ఆర్టీసీ నేతలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగేందుకు మధ్యవర్తిగా ఉంటానని కేశవరావు అన్నారు.