Monday, August 19, 2019
Follow Us on :

కొన‌సాగుతున్న ఉత్కంఠ‌

By BhaaratToday | Published On Jul 18th, 2019

క‌న్న‌డ‌నాట‌ రాజకీయం గంట‌గంట‌కు ఆస‌క్తిక‌రంగా మారుతుంది. కాంగ్రెస్-జేడీఎస్‌ సభ్యుల ఆందోళన నేపథ్యంలో సభ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11గంటలకు తిరిగి సభ సమావేశం కానుంది. విప్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అస్పష్టంగా ఉందంటూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మరోవైపు దీనిపై బీజేపీ సభ్యులు నిరసన చేపట్టారు. తమ ఎమ్మెల్యేలంద‌రూ రాత్రంతా ఇక్కడే ఉంటారని, ఇక్కడే ధర్నా చేస్తామని ఆ పార్టీ నేత యడ్యూరప్ప ప్రకటించారు. సభ వాయిదాపడిన అనంతరం కాంగ్రెస్‌- జేడీఎస్‌ సభ్యులు బయటకు రాగా.. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే సభలోపలే ఉండిపోయారు.

అంతకుముందు సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. బలపరీక్ష వాయిదా వేసేందుకే కాంగ్రెస్ ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తోందంటూ బీజేపీ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ వాజూబాయి వాలాను కలిసి బలపరీక్ష జరిగేలా చూడాలని బీజేపీ నేతలు కోరారు. దీంతో గవర్నర్‌ .. స్పీకర్‌ రమేశ్ కుమార్‌కు ప్రత్యేక అధికారి ద్వారా ఓ లేఖ పంపారు. 

ఆ లేఖను స్పీకర్‌ సభలో చదివి వినిపించారు. ఎలాగైనా గురువారం రాత్రికల్లా బలపరీక్ష జరిగేలా చూడాలని గవర్నర్‌ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అనంతరం కూడా సభలో ఆందోళనలు కొనసాగడంతో సభను స్పీకర్‌ వాయిదా వేశారు. సభను వాయిదా వేయడంపై బీజేపీ నేత యడ్యూరప్ప మండిపడ్డారు. గురువారం రాత్రికల్లా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ చెప్పినప్పటికీ సభను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. అందుకే ఈ రాత్రంతా సభలోనే ఉండి నిరసన తెలుపుతామని ఆయన స్పష్టం చేశారు.