Saturday, October 19, 2019
Follow Us on :

నన్ను వదిలేస్తే హత్యలే చేస్తా..! పోలీసులకు కిల్లర్ సీరియస్ వార్నింగ్..!!

By BhaaratToday | Published On Feb 5th, 2019

నన్ను వదిలేస్తే మళ్లీ హత్యలు చేస్తాను’ అంటూ పోలీసులనే బెదిరించాడు ఓ హంతకుడు. వివరాల్లోకెళితే.. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన విఠల్‌ అనే వ్యక్తి చిన్నప్పుడే జీవనాధారం కోసం ముంబయి వెళ్లాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు. ఈ నేపథ్యంలో తోటి కూలీలు అతనికి మాదకద్రవ్యాలు ఇచ్చి తప్పుగా ప్రవర్తించేవారు. ఇలాంటి ఘటనలు అతనిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో 2017లో విఠల్‌ ఓ హత్య కేసులో కర్ణాటక పోలీసులకు చిక్కాడు. ఏడాది పాటు అఫ్జల్‌పూర్‌లో జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్న విఠల్‌ 2018 డిసెంబర్‌లో బెయిల్‌పై బయటికి వచ్చాడు. కనీసం అప్పుడైనా కొత్త జీవితం మొదలుపెట్టాలని అతను అనుకోలేదు. నేరుగా మరో హత్య చేసేందుకు ముంబయి వెళ్లాడు. తాను చేసిన మరో రెండు హత్యల గురించి  తెలిసిన స్నేహితుడు ఎక్కడ నిజాన్ని బయటపెట్టేస్తాడోనని భయపడి అతన్ని బండరాయితో మోది చంపేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులకు విఠల్‌పై అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. అతని కోసం గాలింపులు చేపడుతుండగా జవనరి 19న హైవేపై నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పోలీసులకు చిక్కాడు. ఈసారి పోలీసులు విఠల్‌ నుంచి నిజాలు రాబట్టడానికి స్నేహపూర్వకంగా మాట్లాడారు. అప్పుడు విఠల్‌ తాను చేసిన నేరాలన్నీ ఒప్పేసుకున్నాడు. 12 ఏళ్ల వయసులో తాను ముంబయిలో కూలీ పని చేస్తున్నప్పుడు ఎన్నో హింసాత్మక ఘటనలను చూశానని, అవి తనపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపాడు. ‘కొందరు నాకు మాదకద్రవ్యాలు ఇచ్చారు. నాతో తప్పుగా ప్రవర్తించారు. నాకు ఓ అలవాటుంది. ఎవరైనా నన్ను ఎగతాళి చేస్తున్నట్లు మాట్లాడితే మద్యం తాగి ఆవేశానికి గురై హత్యలు చేసేస్తుంటాను. నేను చంపినవారిలో నా చిన్ననాటి స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. నన్ను అరెస్ట్‌ చేయండి. కానీ వదిలిపెట్టకండి. నేను బయటికి వస్తే మళ్లీ హత్యలు చేయడం మొదలుపెడతాను’ అని వెల్లడించాడు విఠల్‌.