Monday, December 09, 2019
Follow Us on :

కాశ్మీర్ పై సర్వహక్కులూ భారత్ వే అంటూ పాక్ కు వార్నింగ్ ఇచ్చిన జమాత్ ఉలేమా ఏ హింద్

By BhaaratToday | Published On Sep 12th, 2019

జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతత తీసుకొని రావడానికి భారత్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ పాకిస్థాన్ మాత్రం విషం జల్లుతూనే ఉంది. ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ యువత చెప్పుడు మాటలు విని తప్పుదోవ పడుతోంది. పాకిస్థాన్ కూడా ఎందరినో ప్రేరేపిస్తూ.. భారత్ కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలను తయారుచేస్తోంది. అందుకే జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడి ప్రజలకు కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ప్రభుత్వం భావించింది. అయితే పాకిస్థాన్ మాత్రం కాశ్మీర్ మాదేనని.. భారత్ లో ముస్లిం లను హింసిస్తున్నారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. 

అయితే పాక్ చేస్తున్న వ్యాఖ్యలకు జాతీయవాద ముస్లిం సంస్థ ‘జమాత్ ఉలేమా ఏ హింద్’ సమాధానం ఇచ్చింది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని ప్రత్యేకంగా తీర్మానం చేసినట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మహమూద్ మదానీ తెలిపారు. భారత్ సమగ్రత, భద్రత విషయంలో తాము వెనక్కి తగ్గబోమని.. భారత్ తమ దేశమనీ, తాము దేశానికి అండగా నిలుస్తామని తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ముస్లింలు భారత్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు అంతర్జాతీయ సమాజానికి చూపేందుకు ప్రయత్నిస్తున్న చర్యలన్నీ అబద్ధమని ఆయన అన్నారు. పాక్ చేస్తున్న ఇలాంటి చర్యలను తాము ఖండిస్తున్నామని ఆయన అన్నారు.