Tuesday, October 15, 2019
Follow Us on :

రిటన్ గిఫ్ట్ మాటలు సంచలనం అయిన తరుణంలో.. కేసీఆర్ ఏపి ప‌ర్య‌ట‌న ఖ‌రారు

By BhaaratToday | Published On Jan 29th, 2019

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా ఏ పని చేసినా అది కాస్త భిన్నంగానే ఉంటుంది. గతంలో ఢిల్లీ పర్యటనలు, ఏపీకి ప్రత్యేక హోదాపై వ్యాఖ్యలు.. ఏపీ సీఎం చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ గురించి మాట్లాడిన మాటలతో రాజకీయంగా సంచలనం రేపాయి. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు పూనుకోవడంతో.. అది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. వ‌చ్చే నెల 14న  కేసీఆర్ ఏపి ప‌ర్య‌ట‌న ఖ‌రారు కావ‌డం ఉత్సుక‌త‌ను రేకెత్తిస్తోంది. మరి ఏపీ టూర్ లో కేసీఆర్ ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెరతీస్తారో అనే అంశం పై న‌రాలు తెగే ఉత్కంఠ నెల‌కొంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. శారదా పీఠంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. వచ్చే నెల 14న శారదా పీఠంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరుకావాలని శారదా పీఠం నుంచి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. దీనిపట్ల సానుకూలంగా స్పందించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇటీవల కేసీఆర్ విశాఖ శారదాపీఠాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు రెండోసారి మళ్లీ అక్కడకు వెళ్లనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు రాజకీయ వర్గాల్లోనూ విశాఖలో రెండోసారి పర్యటించనుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫిబ్రవరి 14న మంచి ముహూర్తం ఉండటంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం..అమరావతిలో నూతన గృహప్రవేశం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అటు ఈ కార్యక్రమానికి రావాలని కూడా కేసీఆర్ కు ఆహ్వానం అందింది. 

ఇటీవల కేసీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్,.. త్వరలోనే కేసీఆర్ ఏపీకి వెళ్లి జగన్‌తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారని తెలిపారు. దీంతో విశాఖలో పర్యటించనున్న సీఎం కేసీఆర్, అక్కడి నుంచి నేరుగా వెళ్లి జగన్‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా ముంద‌స్తు ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు తెలంగాణ అదికార గులాబీ పార్టీకి వ్య‌తిరేంగా ప్ర‌చారం చేసి.. కేసీఆర్ తో రాజ‌కీయంగా దూరాన్ని పెంచుకున్నారు. సామ‌ర‌స్యంగా ఉండాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల మ‌ద్య రాజ‌కీయ వైరుద్యం నెల‌కొంది. రాజ‌కీయంగా నీఅంతు చూస్తామ‌ని ఒక‌రంటుంటే,.. నీఅంతే చూస్తామ‌ని మ‌రొక‌రు కాలు దువ్వే వ‌ర‌కు ప‌రిస్ధితులు వెళ్లాయి. దీంతో రిటర్న్ గిఫ్ట్ తప్పదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇఫ్పుడు ఏపీ టూర్ తో ఆ మాటలను ఆచరణలో పెట్టేందుకేనంటూ ప్రచారం జరుగుతుండటంతో.. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.