Monday, September 23, 2019
Follow Us on :

అత్తి వరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్.. 40 సంవత్సరాలకు బయటకువచ్చే స్వామి వారు..!

By BhaaratToday | Published On Aug 12th, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తమిళనాడులోని కంచి అత్తి వరదరాజు స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు, పూజార్లు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి కేసీఆర్, ఆయన సతీమణి శోభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు, కేసీఆర్ దంపతులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 


కంచిలో అత్తి వరదరాజ స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.  ప్రతి 40 సంవత్సరాలకూ 48 రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు. ఈ సంవత్సరం జూలై 2న స్వామి బయటకు వచ్చారు. ఆగస్టు 17 వరకూ దర్శనమిస్తారు. బ్రహ్మదేవుడే ఈ శ్రీ అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని చెక్కించాడని, అందుకు దేవశిల్పి విశ్వకర్మ సహకరించాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు ఓ యజ్ఞాన్ని ప్రారంభించి, అందుకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చూసేందుకు విష్ణుమూర్తి విగ్రహాన్ని తయారు చేయించి, కంచిలో స్వయంగా ప్రతిష్ఠించాడు. ఈ స్వామి అగ్నిదేవుని స్వరూపం. బయట ఎక్కువకాలం ఉండలేరు. స్వామికి నిత్యాభిషేకాలు తప్పనిసరి. 9 అడుగుల ఎత్తున ఉండే విగ్రహం. మధ్యయుగంలో దాడులు జరుగుతున్న సమయంలో వెండిపెట్టెలో అమర్చి, దేవాలయానికి దగ్గరలో ఉండే పుష్కరిణిలో దాచిపెట్టాలని నిర్ణయించారు. ఆపై అదే దేవుని శిల్పాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అనంతరం స్వామికి నిత్య కైంకర్యాదులు జరగడం లేదన్న ఆలోచనతో, ప్రతి 40 సంవత్సరాలకూ ఓ మారు బయటకు తీసి, పూజలు నిర్వహించాలని ఆలయ ధర్మకర్తలైన వరదరాజ పెరుమాళ్‌ వంశం నిర్ణయించింది.