Monday, November 18, 2019
Follow Us on :

జాలి లేని జాలీ.. ఆరుగురి హత్య కేసులో భయానక నిజాలు

By BhaaratToday | Published On Oct 15th, 2019

కనిపించే మనిషిలో కనిపించని మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..? దీనికి కేరళకు చెందిన జాలీ ఉదంతమే నిలువెత్తు నిదర్శనం. అమాయకంగా కనిపించే ముఖం. అందమైన రూపం.. అంతకు మించిన చలాకీతనం. అలాంటి మహిళలో సైకోకు ఏ మాత్రం తగ్గని నరహంతకుడు ఉన్నాడన్న విషయాన్ని నమ్మగలమా.?!? కానీ అదే నిజం..! కట్టుకున్న భర్తను.. ఆరేళ్ల చిన్నారితో మొదలు.. అత్తా.. మామతో సహా మరో ఇద్దరిని సైలెంట్ చంపడమే కాదు.. ఎక్కడా అనుమానం రానివ్వలేదు. అయితే ఇప్పుడు ఆ కిలాడీ విచారణలో వెల్లడించిన విషయాలు తెలిసి పోలీసులే విస్తుపోతున్నారు. 

అది కేరళలోని కోళికోడ్. ఓ ఉమ్మడి కుటుంబం. అనందమయ జీవితం. అలాంటి కుటుంబంలో 17ఏళ్ల క్రితం అనుకోకుండా విషాదం నెలకొంది. ఆ ఇంటి పెద్దావిడ ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. మృతి  చెందింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన ఆరేళ్లకు ఆమె భర్త సైతం ఏదో తింటుండగా కుప్పకూలిపోయి మరణించాడు. ఆ తర్వాత మూడేళ్లకు ఈ దంపతుల కొడుకు చనిపోయాడు. ఇక రెండేళ్లకు ఇంటి పెద్దావిడ తమ్ముడు కూడా మృతిచెందాడు. మరో రెండేళ్లకు ఇద్దరు బంధువులు మరణించారు. 

ఆస్తికోసం క్రూరమైన ప్లాన్లు వేసి అయినవాళ్లను చంపించే అత్తగార్లు, కోడళ్లు టీవీ సీరియళ్లలోనే ఉంటారనుకుంటే పొరపాటే! అంతకుమించిన విలనిజం ఆమెది..! ఆస్తి కోసం అత్తమామల్ని, చెడు స్నేహాలు మానాలని మందలించినందుకు భర్తను.. వారిని తానే చంపినట్లు అనుమానించినందుకు అత్తగారి సోదరుణ్ని చంపేసింది ఓ కోడలు. భర్త సోదరుడిపై వ్యామోహం పెంచుకుని అతడి భార్యను, ఆ దంపతుల రెండేళ్ల కూతుర్ని పొట్టనబెట్టుకుంది! ఆ తర్వాత ఏడాదికే భర్త సోదరుణ్ని వివాహం చేసుకుని అనుకున్నది సాధించింది!! సైనేడ్‌తో ప్రాణాలు తీయడం.. ఆపై ఏమీ ఎరగనట్టు శోకాలుపెడుతూ అందరి సానుభూతి పొందడం.. ఇదీ ఆమె స్టయిల్‌. 

కేరళలో 2002 నుంచి 2016 వరకు జరిగిన ఆరుగురి హత్య కేసులో భయానక నిజాలు వెలుగు చూశాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ కేసును పోలీసులు చేధించడం చర్చానీయాంశమైంది. భర్తతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన నిందితురాలిని వారం క్రితం అరెస్ట్ చేశారు. అయితే కేరళ సైనెడ్ కిల్లర్ జాలీ కేసులో మరికొన్ని విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆమె జాలీ లైఫ్, వివాహేతర సంబంధాలు, రియల్ ఎస్టేట్ డీల్స్ వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడో వివాహానికి జాలీ సిద్ధమవుతుండగా జాలీ బాగోతం బయటపడి సంచలనమైంది. ఆస్తి కోసం భర్త సహా ఆరుగురు కుటుంబ సభ్యులను ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేసింది.

జాలీ కేసు ఓ సవాలు లాంటిదని కేరళ పోలీస్ చీఫ్ లోక్‌నాథ్ బెహ్రా అన్నారంటే జాలీ ఎంతటి కరుడుగట్టిన నేరస్తురాలో అర్థం చేసుకోవచ్చు. భర్త సహా ఆరుగురు కుటుంబ సభ్యులను చంపేసినట్టు జాలీ నిర్భయంగా ఒప్పుకుంది. అయితే, ఈ విషయం బయటపడకుండా సంవత్సరాలపాటు జాగ్రత్త పడింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంతకాలం ఎలా జాగ్రత్త పడిందన్నది పోలీసులనే విస్తుపోయేలా చేసింది. జాలీకి ఒకింత ధైర్యం కూడా ఎక్కువేనని చెప్పుకొచ్చారు కేరళ పోలీస్ చీఫ్. మొదటి హత్యకు ఆరో హత్యకు మధ్య 14 ఏళ్ల దూరం పాటించిందని తెలిపారు. తొలి హత్య 17 ఏళ్ల క్రితం జరిగిందని, చివరి హత్య మూడేళ్ల క్రితం జరిగిందని వివరించారు. ఈ ఆరు వేర్వేరు కేసులు కావడంతో సాక్ష్యాలు సేకరించడం సవాలుగా మారిందన్నారు. 

అయితే మద్యం తాగే అలవాటున్న జాలీ 2014లో తన మేనమామ మాథ్యూను హత్య చేసింది. విచిత్రం ఏమిటంటే.. మాథ్యూ మరణించిన ముందు రోజు రాత్రి అతడితో కలిసి జాలీ మద్యం తీసుకుంది. మిగిలిన మద్యంలో తర్వాతి రోజు సైనేడ్ కలిపి అతడికి ఇవ్వడంతో ఆయన వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. జాలీ వెల్లడించిన మరో విషయం విచారణాధికారులను షాక్‌కు గురిచేసింది. భర్త చనిపోయిన రెండు రోజుల తర్వాత బీఎస్ఎన్ఎల్‌లో పనిచేసే తన స్నేహితుడు జాన్సన్‌తో కలిసి కోయంబత్తూరుకు విహారయాత్రకు వెళ్లింది. జాలీ ఈ విషయం చెప్పగానే పోలీసులు వెంటనే కోయంబత్తూరుకు చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అంతేకాదు నిట్ కోజికోడ్‌లో లెక్చరర్‌నని చెప్పుకునే జాలీ కాలేజీకి వెళ్తున్నట్టు ప్రతి రోజూ ఇంటి నుంచి వెళ్లేదానని చెప్పడంతో విచారణాధికారులే విస్తుపోయారు.

 2002 నుంచి 2016 దాకా కేరళలోని కోజికోడ్‌లో 2002 నుంచి 2016 వరకు జరిగిన వరుస హత్యలు కలకలం రేపాయి. పధ్నాలుగేళ్లలో ఆరు సీరియల్ మర్డర్స్ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. కేవలం ఆస్తి కోసం ఆరుగురిని పొట్టనబెట్టుకున్న వైనం మరోసారి హాట్ టాపికైంది. పొన్నమట్టం అన్నమ్మ థామస్ టీచర్‌గా పనిచేశారు. 2002 సంవత్సరంలో రిటైరయ్యారు. ఆ క్రమంలో అత్తగారి కుటుంబ ఆస్తిపై కన్నేసిన ఆ ఇంటి కోడలు జాలీ వరుస హత్యలకు శ్రీకారం చుట్టింది. అత్త, భర్తను చంపిన తర్వాత ఆస్తికి అడ్డు రాకుండా మరో నలుగురు బంధువులను సైతం మర్డర్ చేసింది. 2002లో అన్నమ్మ చనిపోయిన ఆరేళ్ల తర్వాత అంటే 2008లో ఆమె భర్త టామ్ థామస్ కన్నుమూశారు. అదే క్రమంలో 2011లో జాలీ భర్త రాయ్ థామస్ కూడా చనిపోయారు. 

అదలావుంటే 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ మంజాదియల్‌ కూడా జాలీ మామ, భర్త చనిపోయిన రీతిలో మృత్యువాత పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. అదే క్రమంలో 2016లో వారి బంధువుల కుమార్తె రెండేళ్ల చిన్నారి అల్ఫాన్సా గుండె పోటుతో మరణించడం.. అది జరిగిన కొద్ది నెలలకే ఆ పాప తల్లి సిల్లీ కూడా చనిపోవడం ఆ ఇంట్లో భయాందోళనలు రేకెత్తించింది. వరుసగా చనిపోతున్న తీరు అప్పట్లో సంచలనంగా మారింది.  స్థానిక పోలీసులకు సవాల్ విసిరింది. ఆరుగురి హత్యలు సహజ మరణంగా కనిపించినా.. దాని వెనుక ఏదో కుట్ర దాగుందన్న పోలీసుల అనుమానం చివరకు నిజమైంది. పథకం ప్రకారం ఒక్కొక్కరిని మట్టుబెట్టుకుంటూ వచ్చిన జాలీకి ఆమె రెండో భర్త షాజు సహకరించాడు.  

అన్నమ్మ కోడలు జాలీనే ఈ సీరియల్ కిల్లింగ్స్ సూత్రధారిగా తేలింది. కేవలం ఆస్తి కోసం కుటుంబ సభ్యులను, బంధువులను ఈ విధంగా హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమెతో పాటు రెండో భర్త షాజును మరొకరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఆరు హత్యల్లో కూడా సైనేడ్‌తో విష ప్రయోగం చేసినట్లు తేలింది. అందుకే ఇన్ని సంవత్సరాల పాటు జాలీ పక్కా స్కెచ్‌ను పోలీసులు పసిగట్టలేకపోయారు. బంధువైన సిల్లీని చంపడమే గాకుండా ఆమె భర్తకు దగ్గరైన జాలీ అతడిని రెండో పెళ్లి చేసుకుంది. అత్తగారి కుటుంబానికి చెందిన ఆస్తిని తన పేరు మీద రాయించుకోవడానికి మామ టామ్ మీద తీవ్ర వత్తిడి తెచ్చిన జాలీ ఆస్తిని కూడా లాగేస్తుంది. 

అయితే అమెరికాలో స్థిరపడ్డ టామ్ చిన్న కుమారుడు మోజో ఆస్తి బదలాయింపును సవాల్ చేస్తూ వరుస మరణాలపై స్పెషల్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.  గలాగితే డొంకంతా కదిలింది. పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేయగా.. సైనేడ్ ఉపయోగించి ఆరుగురిని హతమార్చినట్లు ఒప్పుకుంది జాలీ. మొత్తానికి 17 ఏళ్ల తర్వాత వరుస హత్యల చిక్కుముడి వీడటం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.  

ఇక జాలీ ఈ హత్యలు చేయడానికి బంగారం దుకాణం యజమాని ప్రాజు కుమార్‌, జాలీ దగ్గరి బంధువు ఎం.ఎస్‌. మాథ్యూ సహకరించారు. ఆభరణాల తయారీలో వాడేందుకు తెచ్చిన సైనేడ్‌ను జాలీకి మాథ్యూ ఇచ్చేవాడు. అయితే జాలీ తన భర్త సోదరి అయిన రెజీని కూడా చంపేందుకు కుట్ర పన్నింది. ఆయుర్వేద టానిక్‌ తాగినప్పుడు రేజీ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అయితే నీళ్లు ఎక్కువగా తాగడంతో పరిస్థితి మెరుగైందని రేజీ చెప్పారు.

అయితే 14 ఏళ్ల వ్యవధిలో ఆరు హత్యలు చేసిన జాలీ మొదట పోలీసుల లై డిటెక్టర్ టెస్టునూ తోసిపుచ్చింది. కానీ పోలీసులు సమాధులు తవ్వి మరీ ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. జాలీ రెండో భర్త, సైనెట్ తెచ్చిపెట్టిన మరో వ్యక్తి మొత్తం నిజాలు కక్కేశారు. ఇంకేముంది.?!? మొత్తం కథ తేటతెల్లంగా బయటపడింది. ఈ గుండెలు తీసిన బంటు బండారం అంతా క్లియర్ గా తెలిసిపోయింది. ఓ మహిళ ఇన్ని ఏళ్ల పాటు ఇంత కూల్ గా ఈ హత్యాకాండలను నడిపించడంపై పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూశారుగా 2002 నుంచి 2016 దాకా ఆరు హత్యలు.. ఎక్కడా తొణకలేదు. తొట్రుపాటు లేదు. సైలెంట్ గా కిల్ చేసిపారేసింది. అయితే కథ అమె అనుకున్నట్టుగా చరిత్ర పుటల్లోకి చేరకపోవడమే కొసమెరుపు.