Sunday, August 25, 2019
Follow Us on :

ఖమ్మం కార్పొరేషన్ లో.. పనులు పక్కనపెట్టి టిక్ టాక్ లో టాలెంట్

By BhaaratToday | Published On Jul 15th, 2019

దునియా మొత్తం టిక్ టాక్ మయమైంది. చేతిలో మొబైల్‌ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం అరచేతిలో ఉన్నట్లే మరి. ఇక జనాలు ఆగుతారా.. సెల్ఫీలతో మొదలై.. డబ్ స్మాష్లతో పిచ్చెక్కిస్తున్నారు. ఇక టిక్ టాక్  లో చిత్ర, విచిత్రమైన ఫీట్లు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. మరికొందరైతే వెరైటీ కోసమంటూ బరితెగిస్తున్నారు. అయితే ఖాళీ సమయాల్లో టిక్ టాక్ తో గడిపేస్తే వేరు. కానీ.. ప్రజా అవసరాలను పక్కన పెట్టి మరీ.. అధికారులు టిప్ టాప్ గా టిక్ టాక్ లో లీనమవువ్వడం ప్రజాగ్రహానికి గురిచేస్తోంది.

ఆ మధ్య ఓ ఆసుపత్రిలో నర్సులు పేషెంట్లను వదిలేసి.. టిక్ టాక్ వీడియోలో మునిగిపోవడం సంచలనంగా మారింది. ఆ తర్వాత వారిని ఉన్నతాధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. అయితే మళ్లీ ఇప్పుడు అలాంటి ఘటనే ఖమ్మం కార్పొరేషన్ లో చోటు చేసుకుంది. కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ విధులు పక్కనపెట్టి టిక్ టాక్ లో టాలెంట్ చూపిస్తున్నారు. డ్యాన్సులు, డైలాగులతో వీడియోలు అప్ లోడ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. 

గతంలోనూ ఇదే తరహాలో చేసి దొరికితే.. కమిషనర్ హెచ్చరించినట్లు సమాచారం. మరికొందరికి నోటీసులు ఇచ్చినా.. అక్కడి సిబ్బంది వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారినప్పటి నుంచి ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో.. అధికార యంత్రాంగంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అక్కడి ఉద్యోగ సిబ్బంది మాత్రం పనులు గాలికి వదిలేసి ఇలా టిక్ టాక్ వీడియోలతో కాలక్షేపం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ.. పనులు గాలికొదిలేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లతో పాటు.. ఖమ్మం వాసులు డిమాండ్ చేస్తున్నారు.