Friday, July 19, 2019
Follow Us on :

చంపేస్తామంటూ కిష‌న్ రెడ్డికి బెదిరింపు కాల్స్

By BhaaratToday | Published On Mar 13th, 2019

పలు ముస్లిం దేశాలు, విదేశాల నుంచి తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఈ విష‌య‌మై దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను మంగళవారం ఆయన కలుసుకున్నారు. లండన్‌లో జనవరి 21న కాంగ్రెస్‌ నేత కపిల్‌సిబల్‌, సయ్యద్‌ సుజా అనే వ్యక్తి కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి 2014 ఎన్నికలకు ముందు తాను 11మందిని హత్య చేయించానని, ఆ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు తోడ్పడ్డానని ఆరోపించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ఈ సందర్భంగా తీసుకెళ్లారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేయించాలని, కేసును సీబీఐకి అప్పజెప్పాలని ఆయన కోరారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..  కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేసిన కపిల్‌సిబల్‌ నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించినందున ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని.. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన తెలిపారు. తెలంగాణలో 16సీట్లు గెలిపిస్తే దిల్లీలో చక్రం తిప్పుతామని తెరాస నేతలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. నరేంద్రమోదీ దేశానికి మళ్లీ ప్రధాని అవుతారని, దేశ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రజలు భాజపాకు ఓటు వేయాలని ఆయన కోరారు.