Tuesday, September 24, 2019
Follow Us on :

చనిపోయిన ఒక్కో విద్యార్థికి 2 కోట్లు ఇవ్వాలి

By BhaaratToday | Published On Apr 25th, 2019

తెలంగాణ ఇంటర్ మీడియేట్ బోర్డు చేసిన తప్పిదాలకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన జ్వాలలు ఎగశాయి. ప్రతి విద్యార్థికీ రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇచ్చి తీరాలని బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగానే వారంతా ఆత్మహత్య చేసుకున్నారని.. మరణించిన ప్రతి విద్యార్థికీ రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇచ్చి తీరాలని  కృష్ణయ్య కోరారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాల బాధను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ ను ఉచితంగా చేస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంటర్ బోర్డును  ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, కార్పొరేట్ కాలేజీల జోక్యం తగ్గాలని అన్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని, వారిని వెంటనే తొలగిస్తేనే, మరోసారి ఇటువంటి తప్పు జరుగకుండా ఉంటుందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ ఇంటర్ బోర్డు ఈరోజు ఉదయం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ బోర్డు చేసిన తప్పులపై బుధవారం సమీక్ష జరిపిన తెలంగాణ సీఎం, ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ను ఉచితంగా చేయాలని ఆదేశించారు. ఈ ఉదయం ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఉత్తీర్ణత సాధించని వారు దరఖాస్తు చేసుకోకున్నా కూడా అందరికీ రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నగదును తిరిగి చెల్లించనున్నారు. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం ఇంటర్‌ నెట్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని తెలిపింది ఇంటర్ బోర్డ్. మే 15 లోపు కొత్త ఫలితాలను, కొత్త మార్కుల మెమోలను విద్యార్థుల ఇంటికి పంపుతామని తెలిపింది.