Friday, July 19, 2019
Follow Us on :

భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు కేసీఆర్ ప్లాన్‌

By BhaaratToday | Published On Mar 13th, 2019

లోక్ సభ ఎన్నికల తేదీకి కేవలం నెలరోజులు మాత్రమే మిగిలి ఉండడంతో.. ఆ నెలరోజులూ చేయాల్సిన‌ సందడికి స్కెచ్ గీసుకున్నాడు. హైదరాబాద్ మినహా 16 లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసిన సీఎం కేసీఆర్.. ఒక్కో సభకు రెండు లక్షలకు తగ్గకుండా జనసమీకరణ జరగాలని నేత‌ల‌ను ఆదేశించారు. ఈ ఇన్నింగ్స్ ఆరంభానికి కరీంనగర్‌ని వేదికగా మలచుకున్నారు. మార్చి 17న కరీంనగర్ సభ తర్వాత, 19న నిజామాబాద్ సభ నిర్వహిస్తారు. మిగతా షెడ్యూల్ తర్వాత వెల్లడిస్తారు. ఇంతకీ.. కరీంనగర్‌కీ కేసీఆర్‌కీ ఉండే అవినాభావ సంబంధం ఏమిటి?

2004, 2006, 2008.. ! కేవలం నాలుగేళ్ల గ్యాప్‌లో మూడు సార్లు ఇదే కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన క్రెడిట్ కేసీఆర్‌దే. 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక మొట్టమొదటిసారి కరీంనగర్‌కే టూరేశారు కేసీఆర్. తన మానసపుత్రికగా చెప్పుకునే ‘రైతుబంధు’ పథకాన్ని గత ఏడాది కరీంనగర్ వేదిక మీదనుంచే ప్రారంభించారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో 2001లో సింహగర్జన పేరుతో కరీంనగర్‌లోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. తెరాస ఉనికిని దేశానికి పరిచయం చేశారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కేరాఫ్ కరీంనగర్.. ఈ సెంటిమెంట్ వెనకుండే సీక్రెట్ ఏమిటి?

17న జరగబోయే కరీంనగర్ సభలో కేసీఆర్ ‘జాతీయ ప్రణాళిక’ను ప్రకటిస్తారని తెలుస్తోంది. తన ఫెడరల్ ఫ్రంట్ భవితవ్యాన్ని నిర్ణయించేది ఈ ఎన్నికలే కనుక.. 16 అవుటాఫ్ 16 సెగ్మెంట్స్ గెలుచుకుని ఢిల్లీలో తలెత్తుకునే ఛాన్స్ తనకు దక్కేలా చేయాలని కేసీఆర్ పిలుపునివ్వనున్నారు. తన ‘రైతుబంధు’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిన విషయాన్ని ఇక్కడే ఎక్స్‌పోజ్ చేయనున్నారు కేసీఆర్. కేంద్రానికి తెలంగాణ ఒక దిక్సూచి లాంటిదని చెబుతూ.. ఇదే వేదిక మీద తన నేషనల్ ఎజెండాను ఎనౌన్స్ చేస్తారట. తన తెలంగాణ ఉద్యమానికి పురుడు బోసిన కరీంనగర్ గడ్డ మీద నుంచే ‘ఫెడరల్ ఫ్రంట్’ ఆశల్ని కూడా చిగురింప జేసుకుంటారని, అక్కడ చేసే కేసీఆర్ ప్రసంగం దేశం మొత్తం ఇటువైపు చూసేలా ఉంటుందని తెరాస భావిస్తోంది.