Friday, December 06, 2019
Follow Us on :

దీదీ కోసం పీకే వ్యూహం..!

By BhaaratToday | Published On Jun 6th, 2019

తాజా లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం మొదలైన నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిషోర్‌ను నియమించుకునే యోచనలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతోనే ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని ‘ఐప్యాక్‌’ బృందం సేవలు తీసుకోవాలని మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రశాంత్‌ కిశోర్‌తో దాదాపు 2 గంటలకు పైగా మమత భేటీ అయ్యారు. ప్రత్యేక ఎన్నికల వ్యూహంతో ఏపీలో ఎలా విజయం సాధించారన్న విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం తృణమూల్‌ తరఫున పశ్చిమబెంగాల్‌ ఎన్నికల వ్యూహకర్తగా వ్యహరించేందుకు అవసరమైన ఒప్పంద పత్రాలపై ఇద్దరూ సంతకాలు చేసినట్లు సమాచారం.

ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పని చేశారు. ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ  151 స్థానాలు,  25 లోక్‌సభ స్థానాలకు గానూ 22 చోట్ల  వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల‌లో ప్రధాని మోదీకి,  2015లో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పని చేశారు.

ఇదిలా వుంటే ఇటీవ‌ల లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో బెంగాల్ లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. గతంలో 34 స్థానాలు సాధించిన తృణమూల్‌ ఈ సారి 22 స్థానాలకు పడిపోయింది. రాష్ట్రంలో పార్టీ హవా తగ్గుతున్న క్రమంలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మమత ఇప్పటి నుంచే చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.