Friday, March 22, 2019
Follow Us on :

పాత క‌క్ష‌ల‌తో బావ‌మ‌రిదిని హ‌త్య చేయించిన కాంగ్రెస్ నేత‌..!

By BhaaratToday | Published On Mar 16th, 2019

ఆస్తి తగాదాలు, రాజకీయ కారణాలతో ఓ కాంగ్రెస్ నేత‌ స్వయానా త‌న సొంత‌ బావమరిదినే అనుచరులతో దారుణంగా హత్య చేయించాడు. అనంత‌రం మృతదేహాన్ని తన ఫాంహౌస్‌లోనే పాతిపెట్టించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది. చేవెళ్ల సీఐ గురువయ్యగౌడ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. షాబాద్‌ మండలం నరెడ్లగూడకు చెందిన ముక్కు రామ్మోహన్‌(40) కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి భీంభరత్‌కు స్వయానా బావమరిది. కొంతకాలంగా వీరి మధ్య ఆస్తి తగాదాలు, రాజకీయ వ్యతిరేకతలు కొనసాగుతున్నాయి. అన్నిట్లో అడ్డుగా ఉన్న బావమరిదిని అంతమొందించాలని నిర్ణయించుకున్న భీంభరత్‌.. ఆ పని తన అనుచరులు మహేష్‌, ముక్కు రవికి పురమాయించాడు. వీరిద్దరూ అదే గ్రామానికి చెందిన ముక్కు అశోక్‌, రమేశ్‌, తగరం నాగరాజ్‌, మల్కి నర్సింహులతోకలిసి రామ్మోహన్‌ హత్యకు పథకం పన్నారు. ప‌ని మీద‌ మోటర్‌ సైకిల్‌పై నాగర్‌కుంట వైపు వెళ్తున్న రామ్మోహన్‌ను ద్విచక్రవాహనాలపై వెంబడించారు. బోనగిరిపల్లి గేట్‌ సమీపంలో అడ్డగించి ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో అతను పారిపోతూ కాలికి వైర్‌ తగిలి పడిపోయాడు. దీంతో మహేష్‌ పక్కనే ఉన్న బండరాయితో బలంగా తలపై మోదాడు. స్థానిక గుర్రాల ఫామ్‌లో మేత నరికే కత్తులను వెంట తెచ్చుకున్న అశోక్‌, నాగరాజు, రమేశ్‌ కత్తులతో రామ్మోహన్‌ తల, మెడపై నరికారు. రామ్మోహన్‌ మృతి చెందాక ఉప్పర్‌పల్లిలో ఉన్న భీంభరత్‌కు సమాచారం అందించారు. మృతదేహాన్ని తన ఫాంహౌస్‌లో పాతిపెట్టాలని, తాను ఉదయం వస్తానని ఆయన చెప్పాడు. హంతకులు షాబాద్‌ సమీపంలోని భీంభరత్‌ ఫాంహౌస్‌లో అదే రాత్రి శవాన్ని పూడ్చిపెట్టారు.

మృతుని అన్న విశ్వం, తండ్రి లక్ష్మయ్య రామ్మోహన్‌ కనిపించడం లేదని, గ్రామానికి చెందిన మహేష్‌పై అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం మహేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన రీతిలో విచారించారు. జరిగిన విషయం నిందితుడు పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించాడు. భీంభరత్‌ సహా మిగతా నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారినీ అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఏసీపీ వెంకట్‌రెడ్డి, చేవెళ్ల సీఐ గురువయ్యగౌడ్‌, క్లూస్‌ టీంతో హత్య జరిగిన చోటును పరిశీలించారు. అనంతరం ఫాంహౌస్‌కు చేరుకుని షాబాద్‌ తహసీల్దార్‌ మదన్‌మోహన్‌ సమక్షంలో జేసీబీ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. అక్కడే శవపరీక్ష నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.