Tuesday, October 15, 2019
Follow Us on :

నాంప‌ల్లి ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

By BhaaratToday | Published On Jan 31st, 2019

- భారీగా ఆస్తిన‌ష్టం

- తొక్కిసలాట.. త్రుటిలో తప్పిన ప్రాణ నష్టం

- 150కి పైగా దుకాణాలు ఆహుతి

-  పొగతో 20 మందికి అస్వస్థత

- ముగ్గురు ఆస్పత్రికి.. నీళ్లు లేని ఫైరింజన్‌.. నేడు నుమాయిష్‌కు సెలవు

ప్రజలకు వినోదాన్ని అందించే ఎగ్జిబిషన్‌లో పరిస్థితి దారుణంగా మారింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) అగ్నికి ఆహుతైంది. బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న స్టాళ్లన్నీ బుగ్గిపాల‌య్యాయి. మంట‌లు ఎగిసి పడ్డాయి. అయితే.. ఈ ఘటన జరిగిన సందర్భంలో సుమారు 50వేల‌కు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్‌లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఉధృతంగా ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగ కారణంగా సుమారు పలువురు అస్వస్థతకు గురవడంతో.. వీరికి సమీపంలోని కేర్, ఉస్మానియా ఆసుపత్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి నష్టం మాత్రం వంద కోట్లలో ఉండొచ్చని ప్రాథమిక అంచనా. దాదాపు 400 స్టాళ్లు అగ్నికి పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. దీంతో ఆ స్టాళ్ల యజమానుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. రాత్రి 10.30 గంటల వరకు కూడా మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగిలిన స్టాళ్లకు మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

బ్యాంకు స్టాల్‌లో మంటలు చెలరేగగానే దాని నిర్వాహకులు.. నుమాయిష్‌లోనే ఉన్న ఫైరింజన్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ స్టాల్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న ఫైరింజన్‌ హుటాహుటిన అక్కడికి చేరుకున్నప్పటికీ.. అందులో నీళ్లు లేకపోవడంతో ఫ‌లితం లేకుండా పోయింది.  క్ష‌ణాల వ్యవధిలోనే అగ్ని జ్వాలలు ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమీప ఫైర్‌స్టేషన్‌ నుంచి ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసే సమయానికి తీవ్రత పెరిగిపోయింది. ఎట్టకేలకు 19 ఫైరింజన్లు మూడున్నర గంటల సేపు శ్రమించి మంటలను ఆర్పాయి. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ హాని జరగకున్నా దట్టమైన పొగవల్ల ఉక్కిరిబిక్కిరై 20 మంది అస్వస్థతకు గురయ్యారు.

తొక్కిస‌లాట‌లో ప‌లువురికి గాయాలు:

ఒక్క‌సారిగా అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో సందర్శకులు ప్రాణభయంతో బయటకు వచ్చే క్రమంలో తొక్కిసలాట జ‌రిగింది. దీంతో  కొంద‌రు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. పొగ వల్ల అస్వస్థతకు గురైన ముగ్గురిని నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ముగ్గురిలో ఓ చిన్నారి, ఓ కానిస్టేబుల్‌ ఉన్నారు. గాయపడిన వారిలో అగ్నిమాపక శాఖ సిబ్బంది రాజ్‌కుమార్‌ (45), కాశ్మీర్‌కు చెందిన వ్యాపారి దిలావర్‌ హుస్సేన్‌ (50) ఉన్నారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.వంద కోట్ల దాకా ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు అంచ‌నా వేస్తున్నారు. కాగా.. ప్రమాదవార్త తెలియగానే హోం మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌, సీపీ అంజనీ కుమార్‌ యాదవ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.